రాజకీయాల్లోకి మాజీ హోమ్ మంత్రి భర్త?

ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే తండ్రి బాటలోనే నడిచి హోమ్ మంత్రిగా మహిళకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోమ్ మంత్రి పదవి కట్టబెట్టారు జగన్. అధికారంలోకి రాగానే…

ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే తండ్రి బాటలోనే నడిచి హోమ్ మంత్రిగా మహిళకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోమ్ మంత్రి పదవి కట్టబెట్టారు జగన్. అధికారంలోకి రాగానే మంత్రులందరికీ ముందే చెప్పారు మీ పదవీ కాలం రెండున్నర సంవత్సరాలేనని. కానీ జగన్ కొంతమందిని కొందరిని తీసీశారు. వారిలో సుచరిత ఒకరు. దీంతో ఆమె అప్పటినుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.  

ఆమె రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. చేతిలో పదవి ఉన్నన్ని రోజులూ ఆమె జగన్ కు వీర విధేయురాలిగా ఉన్నారు.  కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టినప్పటికీ ఆమెకు ఎటువంటి అధికారాలు లేకుండా చేశారనే  ప్రచారం జరిగింది.

ఆమె హోం మంత్రిగా ఉన్నపుడు సొంత జిల్లాలోనే ఆమెకు తెలియకుండానే సీఐ, డీఎస్పీ పదవుల నియామకాలు జరిగాయి. అయితే మంత్రి పదవి ఇచ్చారులే అనే తృప్తి మాత్రం ఆమెకు మిగిలింది. ఆమె సొంత నియోజకవర్గంలో ఆమెను నమ్ముకున్న పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో బహిరంగంగా పలుమార్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

తమ ఎమ్మెల్యే మంత్రి అయినా తమకు ఎటువంటి పనులు కావడం లేదని వాపోయేవారు. మంత్రివర్గ విస్తరణలో కొందరికి మినహాయింపునిచ్చి హోం మంత్రిగా ఉన్న సుచరితను తప్పించడంతో ఆమె షాకుకు గురయ్యారు. 

తమ సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఎవరినీ తొలగించకుండా తనను మాత్రమే తప్పించారని ఆమె కొంతకాలం కుమిలిపోయారు. పైగా హోం మంత్రి గా కొనసాగినంత కాలం శాఖాపరంగా ఆమెపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. 

వివాదాస్పదంగా వ్యవహరించిన దాఖలాలు కూడా లేవు. మంత్రి పదవి నుంచి తొలగించారనే అసంతృప్తితో ఉన్న మేకతోటి సుచరితకు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను ఇచ్చారు జగన్. కానీ ఈమధ్యనే ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. వైసీపీలో ఉంటే రాజకీయంగా ఎదగలేమని భావిస్తున్నారుట. అందుకే జనసేనలో చేరాలని దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. కానీ ఇది కేవలం పుకారుగానే అనిపిస్తోంది.

ఇదిలా ఉంటే….ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇటీవల పదవీ విరమణ చివరి దశలో విజయవాడ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. ఆ సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. 

ఇందులో ఢిల్లీలో చక్రం తిప్పే ఓ వైసీపీ ఎంపీ పాత్ర ఉందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన దయాసాగర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారట. మరి జగన్ ఏమంటారో తెలియదు. అయితే సుచరిత రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని చెపుతున్నారు.