టీటీడీ పాలకమండలి విషయంలో బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. జంబో మండలి ఎవరి కోసం అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు. అయితే ఆ జంబో మండలిలో రవిప్రసాద్ అనే వ్యక్తిని సిఫార్సు చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే ప్రచారం మొదలైంది. దీంతో వ్యవహారం కేంద్ర మంత్రి వైపు టర్న్ తీసుకుంది.
మీలాంటివారి సిఫార్సుల వల్లే ఇలాంటి జంబో పాలకమండళ్ల అవసరం వచ్చిందని కొందరు బీజేపీని టార్గెట్ చేశారు. దీంతో కిషన్ రెడ్డి నేరుగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయాల్సిన అవసరం వచ్చింది. తనపై దుష్ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలన చేయాలని ఆయన లేఖలో కోరారు.
టీటీడీ పాలక మండలి విషయంలో ప్రత్యేక ఆహ్వానితులుగా 50మందిని నియమించడంతో కలకలం మొదలైంది. చైర్మన్ సహా ఇప్పటికే 25 మందితో పాలకమండలి కొలువు తీరింది. దీనికి అదనంగా మరో 50మందిని నియమించడం, వారికి కూడా దర్శనాల విషయంలో ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది.
ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో ముందుగా బీజేపీ స్పందించింది, ఆ తర్వాత టీడీపీ కూడా గొంతెత్తింది. ఎవరెన్ని విమర్శలు చేసినా సిఫార్సులను తట్టుకోలేకే పాలకమండలి ఆహ్వానితుల జాబితాను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచాల్సి వచ్చిందనేది మాత్రం వాస్తవం. ఇలా సిఫార్సులు చేసినవారిలో బీజేపీ నేతలు కూడా ఉండటం విశేషం.
పాలకమండలి వ్యవహారంపై బీజేపీ ఏపీలో ఆందోళన చేస్తుండగా.. దానికి పరోక్ష కారణంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు బయటకు రావడంతో ఆయన ఇరుకున పడ్డారు. తన సిఫార్సులేవీ లేవని చెప్పేందుకు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తాను కానీ, తన మంత్రిత్వ శాఖ ద్వారా కానీ ఎవరికీ సిఫార్సు చేయలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టాలన్నారు.
తలాపాపం తిలా పిడికెడు..
ఎంతమంది పాలకమండలి సభ్యులు ఉంటే.. అంత అర్థవంతంగా చర్చలు జరిగి మంచి నిర్ణయాలు బయటకొస్తాయనేది వట్టిమాటే. అందులోనూ ప్రత్యేక ఆహ్వానితులకు కనీసం మీటింగ్ లో పాల్గొనే అర్హత లేదు. మరి వీరందరికీ కేవలం దర్శనాల కోసం, ప్రొటోకాల్ మర్యాదల కోసమే ఇలా సభ్యులుగా చేర్చుకున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అదే సమయంలో సిఫార్సుల కలకలం బయటపడుతుండే సరికి ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా సర్దుకుంటున్నారు. మా తప్పేమీ లేదని భుజాలు తడుముకుంటున్నారు.