దబంగ్ కు రీమేక్ గా గబ్బర్ సింగ్ వచ్చింది. కానీ టేకింగ్ పరంగా ఈ రెండు సినిమాలకు ఎలాంటి సారూప్యత ఉండదు. అంతలా సన్నివేశాలు మార్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. సో.. జిగర్తాండా అనే తమిళ సినిమాకు రీమేక్ గా వస్తున్న వాల్మీకిని కూడా అలానే మార్చేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్.
“తమిళ్ లో బాబీ సిమ్హా హీరో కాదు, మంచి నటుడు. కానీ ఇక్కడ బాబి సిమ్హా పోషించిన పాత్రను చేసిన వరుణ్ తేజ్ హీరో. పైగా తమిళనాడు, తెలుగు మధ్య కల్చర్ లో కూడా తేడా ఉంది. కాబట్టి చిన్న చిన్న మార్పులు చేశాను. దబంగ్ ను గబ్బర్ సింగ్ గా మార్చేశాను కాబట్టి, జిగర్తాండాను కూడా పూర్తిగా మార్చేసి ఉంటానని అంతా అనుకుంటున్నారు. కానీ అలాంటిదేం లేదు. చిన్న చిన్న మార్పులే చేశాను. అవి మిమ్మల్ని ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాను.”
ఇలా రీమేక్ లో మార్పులపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. వాల్మీకి ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ఈ ట్రయిలర్ లాంఛ్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్, ఇలా మార్పుచేర్పులపై మాట్లాడాడు. చేసిన మార్పులన్నీ కొత్తగా ఉంటాయని, అందర్నీ ఆకట్టుకుంటాయని చెబుతున్నాడు. అతడు చేసిన మార్పులు ట్రయిలర్ లో కనిపిస్తూనే ఉన్నాయి.
మరోవైపు సినిమాలో రీమిక్స్ సాంగ్ పై కూడా స్పందించాడు హరీష్. చిరంజీవి, పవన్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వదిలేసి, శోభన్ బాబు పాత పాటను రీమిక్స్ చేయడం వెనక కారణాన్ని బయటపెట్టాడు. ఆ రీమిక్స్ ను కమర్షియల్ గా పెట్టలేదని, కేవలం కథ డిమాండ్ చేయడంతోనే పెట్టానంటున్నాడు హరీష్.
“మెగా హీరోతో సినిమాలు చేసేటప్పుడు చిరంజీవి సాంగ్స్ రీమిక్స్ చేస్తారు. ఆ స్కోప్ ఉందక్కడ. కానీ ఇక్కడ ఈ సాంగ్ చేయడానికి కథాపరమైన సన్నివేశం ఉంది. ఆ డిమాండ్ ఉంది. కావాలని పెట్టింది కాదు, 3-4 సన్నివేశాల సీక్వెన్స్ అది. సినిమా చూస్తే మీకే అర్థమౌతుంది. కమర్షియల్ గా పెట్టాలనుకుంటే చిరంజీవి పాటనే రీమిక్స్ చేసేవాళ్లం. కానీ ఇది కథాపరంగా పెట్టిన సాంగ్.”
వాల్మీకి సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వరుణ్ తేజ్, పూజాహెగ్డేపై ఈ రీమిక్స్ సాంగ్ తీశారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈనెల 20న థియేటర్లలోకి వస్తున్నాడు వాల్మీకి.
వాల్మీకి టీమ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి