డైరక్టర్ హరీష్ శంకర్ దగ్గర విషయం వుందన్న సంగతి ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ప్రూవ్ అయింది. అలాంటిది పెద్దగా జనాల్లో గుర్తింపు తెచ్చుకోని జిగర్తాండ సినిమాను తీసుకుని, మెగా హీరో వరుణ్ తేజ్ తో రీమేక్ చేయడం ప్రారంభించినపుడు, ఏదీ దొరక్క ఈ ప్రాజెక్టు తీసుకున్నారు అనుకున్నారు అంతా. ఇది పక్కా వాస్తవం. కానీ రాను రాను ఆ సినిమా విశేషాలు, స్టిల్స్, టీజర్ బయటకు వస్తుంటే కాస్త ఆసక్తి పెరుగుతూ వచ్చింది. సినిమా విడుదల మరో పదిరోజుల్లో వుందనగా ట్రయిలర్ ఇప్పుడు విడుదల చేసారు.
దీంతో కచ్చితంగా హరీష్ శంకర్ ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగింది. ఓ సినిమాకు అట్రాక్షన్ తీసుకురావాలంటే ఎన్ని చేయాలో అన్నీ హరీష్ శంకర్ ఈ వాల్మీకి సినిమా కోసం చేసినట్లు కనిపిస్తోంది. దాదా గణేష్ గా వున్న వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను పీరియాడిక్ డ్రామాగా మలచడమే కాకుండా, కాస్త అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ చూపించి, యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
అలాగే దాదా నోటివెంట అన్ని రకాల డైలాగులు చెప్పించడం, కిరాతకుడు వాల్మీకిగా మారిన లైన్ కు అడాప్ట్ చేయడం చూస్తుంటే మొత్తంమీద మెగాభిమానులకు, సినిమా అభిమానులకు నచ్చే సినిమా తీయడం కోసం డైరక్టర్ హరీష్ శంకర్ ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది.