కేసీఆర్ తనయుడిగా రాజకీయ ప్రవేశం చేసిన కేటీఆర్…తక్కువ కాలంలోనే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. సమస్యలతో పాటు వాటి పరిష్కారంపై అవగాహన, ప్రత్యర్థులపై రాజకీయంగా ఎదురు దాడి చేయడంలోనూ కేటీఆర్ తనకు తానే సాటి అనే పేరు తెచ్చుకున్నారు. తాజాగా రాజకీయ వారసత్వంపై ఓ వారసుడిగా విలువైన అభిప్రాయాల్ని ఆయన చెప్పారు. ముఖ్యంగా నారా లోకేశ్ తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి.
హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ కీలక ఉపన్యాసం చేశారు. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పత్రికలు చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. యాజమాన్యాలు ఎలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు జర్నలిస్టులు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదన్నారు. అలాగే చదివితే ఏది నిజమో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకుందన్నారు. అలాగే ఏ మీడియాలో అయినా నెగెటివిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సోషల్ మీడియానా లేదా యాంటీ సోషల్ మీడియానా అనేది అర్థం కావడంలేదని కేటీఆర్ అన్నారు.
ముఖ్యంగా రాజకీయాల్లో ఎంట్రీకి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందన్నారు. నాయకత్వ సామర్థ్యం లేకపోతే రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని స్పష్టం చేశారు. ఎవరైనా నాయకుడిగా తనను తాను నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని ఆయన గుర్తు చేశారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారన్నారు.
తండ్రి వారసత్వాన్ని అడ్డు పెట్టుకుని లోకేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రి హోదాలో లోకేశ్ ఓడిపోవడంతో టీడీపీ షాక్కు గురైంది. రానున్న రోజుల్లో లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. నాయకుడిగా తనను తాను నిరూపించుకోడానికి ఇదే సరైన సమయం. దాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారనే దానిపై లోకేశ్ భవిష్యత్ ఆధారపడి వుంటుంది. అందుకే కేటీఆర్ తాజా మాటలను లోకేశ్ కాస్త ఆలకించాలని సూచించడం.