పవన్ ను ముందు పెట్టి నాటకం నడిపించి, రక్తి కట్టించి, పని కానిద్దాం అనుకున్న తెలుగుదేశం ఆశలు అడుగంటుతున్నాయా? తమ మాటలు నమ్మడం లేదు జనం అని తెలుగుదేశం నేతలకు క్లారిటి వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ ను ఎక్కడపడితే అక్కడ ముందుకు తోసి చదరంగం ఆడడం ప్రారంభించారు.
రాజు వెనుక వుంటాడు. బంటు ముందుకు కదులుతాడు అన్నట్లుగా బాబు, చినబాబు హ్యాపీగా హైదరాబాద్ లో కూర్చుంటున్నారు. వాళ్లు ఇచ్చిన ఇటెనరీ, ఎజెండా ప్రకారం పవన్ బాబు ముందుకు సాగుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఒక్కటే భాజపా మద్దుతు. ఇంకా క్లారిటీ గా చెప్పాలంటే భాజపా మద్దతు అనే కన్నా, మోడీ మద్దుతు అన్నది పక్కా నిజం. ఎందుకు అంటే భాజపా కు వున్న ఓట్ల మీద ప్రేమ కన్నా, అధికారం అవసరం ఎక్కువ.
ఎక్కడిక్కడ డబ్బులు పంచాలన్నా, ఎన్నికల్లో వైకాపా ను బలంగా ఢీకొనాలన్నా మోడీ ఆశీస్సులు కావాలి. అంతకు మించి పవన్ దగ్గరకు రావాలంటే తేదేపాకు మోడీ పర్మిషన్ కావాలి. ఇలాంటి నేపథ్యంలో మోడీ-పవన్ మీటింగ్ జరిగింది. దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం దక్కిందా అన్నదే అనుమానం. భాజపా సోలో ఫైట్ కే మొగ్గు చూపుతోందన్న క్లారిటీ పవన్ కు మోడీ నుంచి వచ్చేసినట్లు తెలుస్తోంది. ‘మీరు సోలోగా మీ ఫైట్ చేయండి..పార్టీ మీకు అండగా వుంటుంది ‘ అనే సందేశాన్ని చాలా స్పష్టంగా మోడీ నుంచి పవన్ కు అందినట్లు తెలుస్తోంది.
ఇదే సందేశాన్ని మోడీ భాజపా కోర్ కమిటీ దృష్టికి కూడా తీసుకువచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేయండి అంటూ మోడీ భాజపా నాయకులకు చెప్పారనే వార్తను తెలుగుదేశం మీడియా ప్రచారం చేసే పనిలో పడింది. కానీ సదరు మీడియా బుర్రకు అందని సంగతి ఏమిటంటే అలా చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది తప్ప తెలుగుదేశం బలపడడానికి ఉపయోగపడదు. అదే సమయంలో భాజపా ఎప్పటికీ తేదేపాకు దగ్గర కాదు అన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లే. ఏ పార్టీ అయినా కార్యకర్తలకు ఇదే చెబుతుంది. పొత్తులు మీకు అనవసరం..మీ ఫైట్ మీరు చేయండి అని. గతంలో చాలా సార్లు చంద్రబాబు కూడా తమ పార్టీ జనాలకు ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మోడీ కూడా డిటో.
ఈసారి చంద్రబాబు ఏ అవకాశాన్ని విడిచిపెట్టే పని పెట్టుకోరు. అందుకే పవన్ ను దగ్గరకు లాగాలన్నది ప్రయత్నం. ఎందుకంటే పవన్ గెలిపించలేకపోవచ్చు కానీ ఓడించగలరు అన్న క్లారిటీ వచ్చింది. పవన్ కు కూడా తాను ఒంటరిగా గెలవలేనని, తేదేపా అండ కావాలని క్లారిటీ వచ్చింది. కానీ కలవాలంటే భాజపా పర్మిషన్ కావాలి. అదే పెద్ద సమస్య అయిపోయింది. భాజపా అనుమతి లేకుండా పవన్ రావచ్చు. కానీ బాబోరు తీసుకోలేరు. తీసుకుంటే ఏం జరుగుతోందో అన్నది బాబోరికి ఫుల్ క్లారిటీ వుంది.
అందువల్ల ప్రస్తుతానికి ఓ మహా కూటమి కట్టాలన్న బాబోరి ఆశలు గల్లంతు అయినట్లే.