బీజేపీతో బంధం అంటే…దృతరాష్ట్ర కౌగలి అనే చేదు నిజాన్ని పవన్ గ్రహించలేకపోయారు. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఎందుకనో భయాందోళనకు గురయ్యారు. దీంతో బీజేపీని బతిమలాడి మరీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కుదుర్చుకున్న నాడు ఎన్నెన్నో చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేస్తామని, అలాగే ఏ ఎన్నికల్లోనైనా ఇద్దరం మాట్లాడుకుని పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికారు. అవన్నీ ఏమయ్యాయో తెలియదు.
జనసేన ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీని పవన్ అడిగారు. రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తుంటానని, రాగానే రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం స్టార్ట్ చేస్తానని హెచ్చరించడం తెలిసిందే. రోడ్ మ్యాప్ ఇచ్చామని ఒకసారి, ఇప్పుడావసరం ఏముందని మరోసారి బీజేపీకి చెందిన వేర్వేరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
విశాఖలో ప్రధాని మోదీని పవన్ కలవడానికి కొన్ని గంటల ముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ… వాళ్లిద్దరి మధ్య రాజకీయ పరమైన సమావేశం జరుగుతుందన్నారు. అంతేకాదు, పవన్‌కు మోదీ రోడ్ మ్యాప్ కూడా ఇస్తారని ప్రకటించారు. దీంతో ప్రధాని మోదీతో భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ రోడ్ మ్యాప్ గురించి వివరాలు వెల్లడిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరలేదు. అన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఓ దండం పెట్టి పవన్ వెళ్లిపోయారు.
కానీ గంటన్నర పాటు బీజేపీ నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం ఇచ్చిన నేపథ్యంలో… ఏపీలో ఆ పార్టీ ఎలా ముందుకు సాగాలని అనుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో బీజేపీ స్వతంత్రంగా ఎదగాలనే స్పష్టమైన ఆశయంతో ఉందని ప్రధాని ఆలోచనలు, మాటలు ప్రతిబింబిస్తున్నాయి. మనకు మన పార్టీ ముఖ్యమని మోదీ ఏపీ బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు. బహుశా ఇదే విషయాన్ని పవన్‌తో కూడా ప్రధాని చెప్పి ఉండే అవకాశం ఉంది. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పరితపిస్తున్న పవన్ ఆకాంక్షలకు పూర్తి వ్యతిరేకంగా ప్రధానితో భేటీ జరిగి వుంటుందనేది సుస్పష్టం.
మోదీ, అమిత్‌షా ద్వయం ఎంతసేపూ తమ పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే ఆలోచిస్తారు. రాజకీయాల్లో కాకలుతీరిన యోధుడైన మోదీ ఎదుట పవన్ ఆటలు సాగుతాయనుకోవడం అజ్ఞానమే అవుతుంది. రాజకీయాల్లో బలోపేతం కావాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలనే ఏకైక సూత్రాన్ని అమలు చేయాలంటూ పార్టీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించడానికి కూడా తాను వెళ్లడానికి మోదీ కారణాన్ని చెప్పారు. నిజానికి ఇలాంటి చిన్న కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి తెలియాలంటే వెళ్లక తప్పదని పేర్కొన్నారు.
ప్రజలకు దగ్గరయ్యేందుకు క్రీడాపోటీలు నిర్వహించాలని మోదీ హితబోధ చేశారు. దీన్ని బట్టి ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టొద్దనే ఆలోచనలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో కప్పలాంటి పవన్‌కల్యాణ్… తన వ్యక్తిగత ఎజెండాను అమలు చేయడానికి మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
2024లో తమ వెంట నడిస్తే రాజకీయంగా కలిగే ప్రయోజనాలను మరోసారి ఆ పార్టీ నేతలు పవన్‌కు వివరించే అవకాశాలున్నాయి. ఇదే సందర్భంలో తమను కాదని చంద్రబాబు వెంట నడిస్తే, కలిగే నష్టాల్ని కూడా వివరించే అవకాశం వుంది. ఆ తర్వాత నిర్ణయాన్ని పవన్‌కే వదిలేయాలనే భావనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది. రోడ్ మ్యాప్ పేరుతో తమను ఇరకాటంలో పెట్టాలని పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతిని బీజేపీ పసిగట్టింది.
హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన చందంగా బీజేపీ ఎదుట పవన్ గంతులున్నాయనే విమర్శ వుంది. ఏపీ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశమే అసలుసిసలైన రోడ్ మ్యాప్. అంతకు మించి పవన్‌తో మోదీ చెప్పిందేమీ వుండదనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్ మ్యాప్ అడిగి తీసుకున్న తర్వాత, తనిష్టం వచ్చినట్టు వెళ్తానని పవన్ అంటే కుదరదు. బీజేపీ చెప్పినట్టు వినాల్సిన తప్పనిసరి పరిస్థితిని రోడ్‌మ్యాప్ అడగడం ద్వారా చేజేతులా పవనే కొని తెచ్చుకున్నారు.