మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిలో అసహనం, అక్కసు పతాక స్థాయికి చేరింది. దాని పర్యవసానమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు మంత్రులను పేరుపేరునా తిట్టిపోశారాయన. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్లోనే జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ.
ముఖ్యమంత్రి జగన్పై అయ్యన్నపాత్రుడి అభ్యంతరకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో నిర సనకు దిగారు. అది కూడా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటి వద్ద కావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెల రేగింది. నిన్నంతా ఎక్కడ చూసినా ఇదే చర్చ.
చంద్రబాబు ఇంటి వద్ద జోగి నిరసన, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే అధికార పక్షం వైసీపీ ఎంతో గుణపాఠం నేర్వాల్సి ఉంది. చంద్రబాబు ఇంటిపైకి దాడికెళ్లడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. జగన్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడాన్ని గమనించొచ్చు.
మరి జగన్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఒక్క జోగి రమేశ్ తప్ప, మిగిలిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయకపోవడం దేనికి సంకేతం? జగన్ అధికారంలోకి వచ్చినా తమకెలాంటి ప్రయోజనం లేదని, కేవలం ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే లబ్ధిపొందుతున్నారనే అసంతృప్తి కిందిస్థాయి మొదలుకుని పైస్థాయి వరకూ వైసీపీలో గూడు కట్టుకుని వుంది. అందుకే జగన్పై ప్రధాన ప్రతిపక్ష నేత దూషణకు పాల్పడ్డా ….వైసీపీ ఎమ్మెల్యేలు, శ్రేణులకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఇదే చంద్రబాబు నివాసం వద్ద నిరసన తెలిపితే, దాడిగా చిత్రీకరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించడానికి టీడీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోందనేందుకు నిన్నటి నిరసనలే నిదర్శనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ అధినాయకుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా, పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమే.
కేవలం పోలీసులతో రాజకీయం చేయాలని అనుకుంటే, అది అధికారం ఉన్నంత వరకే. అదే పోతే, ఇదే పోలీసులు రేపు తమ పట్ల కూడా ఇదే రకంగా వ్యవహరిస్తారని గ్రహిస్తే మంచిది. కావున పార్టీ శ్రేణుల్ని యాక్టీవ్ చేసే చర్యలకు వైసీపీ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.