రాజు త‌లుచుకుంటే వ్యాక్సిన్ల‌కు కొద‌వా!

క‌రోనా వ్యాక్సిన్ కూ.. మోడీ పుట్టిన రోజుకూ.. సంబంధం ఏమిటో తెలియ‌దు కానీ, మోడీ పుట్టిన రోజు సంద‌ర్భంగా దేశంలో రికార్డు స్థాయి వ్యాక్సినేష‌న్ జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రెండు కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్…

క‌రోనా వ్యాక్సిన్ కూ.. మోడీ పుట్టిన రోజుకూ.. సంబంధం ఏమిటో తెలియ‌దు కానీ, మోడీ పుట్టిన రోజు సంద‌ర్భంగా దేశంలో రికార్డు స్థాయి వ్యాక్సినేష‌న్ జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రెండు కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ అంటూ మొద‌ట వార్త‌లు రాగా, చివ‌ర‌కు లెక్క రెండున్న‌ర కోట్ల‌కు చేరింద‌ట‌! మోడీ పుట్టిన రోజు న రెండున్న‌ర కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రిగిన‌ట్టుగా అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో గ‌రిష్టంగా కోటి డోసుల వ్యాక్సినేష‌న్  జ‌రిగిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే ఆ పాత రికార్డును నిన్న స‌వ‌రించారు. ఏకంగా రెండున్న‌ర కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రిగింద‌ట‌. ఈ నంబ‌ర్ తో చైనా రికార్డును ఇండియా స‌వ‌రించింది. గ‌తంలో చైనా ఒక రోజు 2.47 కోట్ల వ్యాక్సినేష‌న్ డోసులను వినియోగించి అంత‌ర్జాతీయ రికార్డును నెల‌కొల్పింది. ఆ రికార్డును ఇప్పుడు ఇండియా అధిగ‌మించిన‌ట్టుగా స‌మాచారం.

సెప్టెంబ‌ర్ నెల‌లో రోజుకు డెబ్బై ల‌క్ష‌ల స్థాయిలో స‌గ‌టు వ్యాక్సిన్ల వినియోగం ఉంది. ఆగ‌స్టు ఒక‌టికే  రోజుకు కోటి డోసులు అంటూ గ‌తంలో కేంద్రం ప్ర‌క‌టించినా,  ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కాలేదు. సెప్టెంబ‌ర్ లో మాత్రం స‌గ‌టున రోజువారీ డోసుల సంఖ్య డెబ్బై ల‌క్ష‌ల స్థాయిలో ఉంది. ఇక మోడీ పుట్టిన రోజు రికార్డుతో ఈ స‌గ‌టు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. రోజుకు కోటి డోసులే గ‌గ‌నం అనుకుంటే.. ఏకంగా రెండున్న‌ర కోట్ల డోసుల వినియోగం అంటే, ఉన్న ఫ‌లంగా ఎలా సాధ్య‌మైంద‌బ్బా అంటూ సామాన్యుల‌కు సందేహం రావొచ్చు!

బ‌హుశా స్టాకు ఉన్న వ్యాక్సిన్నంతా ఒకే రోజు వాడేశారు కాబోలు. రాష్ట్రాల వ‌ద్ద స్టాకు ఉందంటూ గ‌తంలో కేంద్రం ప్ర‌క‌టిస్తూ వ‌చ్చింది. అయినా రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వ అన్న‌ట్టుగా.. మోడీ పుట్టిన రోజు కాబ‌ట్టి, వ్యాక్సినేష‌న్ కు కొద‌వా? ఎలాగైతేనేం.. మంచిదే రెండున్న‌ర కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ ఒకే రోజు సాధ్యం అయ్యింది. మ‌రి నిన్న వేసేశాం స్టాక్ అంతా క్లియ‌ర్ అయిపోయిందంటూ ఈ రోజు మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ నంబ‌ర్లు పాతిక ల‌క్ష‌ల‌కో, ప‌ది ల‌క్ష‌ల‌కో ప‌డిపోక‌పోతే  అదే పదివేలు.