ప్చ్‌…మోస‌పోయాం!

బీఆర్ఎస్‌తో పొత్తుపై వామ‌ప‌క్షాలు ఎన్నెన్నో క‌ల‌లు క‌న్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాగైనా త‌మ‌కు నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఇస్తార‌ని, చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం ద‌క్కుతుంద‌ని సీపీఐ, సీపీఎం నాయ‌కులు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. మునుగోడులో…

బీఆర్ఎస్‌తో పొత్తుపై వామ‌ప‌క్షాలు ఎన్నెన్నో క‌ల‌లు క‌న్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాగైనా త‌మ‌కు నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఇస్తార‌ని, చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం ద‌క్కుతుంద‌ని సీపీఐ, సీపీఎం నాయ‌కులు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని ఓడించేందుకు వామ‌ప‌క్షాల స‌హ‌కారాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఇదే ర‌కంగా త‌మతో పొత్తు పెట్టుకుంటార‌ని వామ‌ప‌క్షాలు న‌మ్మి, ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశాయి.

తాజాగా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను కేసీఆర్ ప్ర‌క‌టించే స‌రికి వామ‌ప‌క్షాలు షాక్‌కు గురి అయ్యాయి. క‌నీసం త‌మ‌తో ఒక్క మాటైనా చెప్ప‌కుండా కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించార‌ని వామ‌ప‌క్షాల నేత‌లు ల‌బోదిబోమంటున్నారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణపై చ‌ర్చించేందుకు సీపీఐ, సీపీఎం నాయ‌కులు ఉమ్మ‌డి స‌మావేశం అయ్యేందుకు నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయ అవ‌స‌రానికి త‌మ‌ను కేసీఆర్ వాడుకున్నార‌ని విమ‌ర్శించారు. మునుగోడులో త‌మ‌తో రాజ‌కీయం అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి కేసీఆర్ అప్పుడు దగ్గ‌రికి పిలుచుకున్నార‌ని గుర్తు చేశారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చామ‌న్నారు. రాజ‌కీయాల్లో మోసం చేసేవాళ్లు, మోస‌పోయే వాళ్లు వుంటార‌న్నారు. తాము మోస‌పోయామ‌ని, కేసీఆర్ మోస‌గించార‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే తాము బీఆర్ఎస్‌ను న‌మ్ముకుని లేమ‌నడం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా క‌లిసొస్తే పోటీ చేస్తామ‌న్నారు. లేదంటే ఒంట‌రిగా పోటీ చేస్తామ‌న్నారు. పొత్తుపై తాము వెంప‌ర్లాడ‌లేద‌న్నారు. ప్ర‌జాతంత్ర పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌న్నారు. ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌నేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్నారు.