మొన్నటివరకు అచ్చెన్న మాత్రమే అనుకున్నాం. కానీ ఇప్పుడు అయ్యన్న కూడా రెడీ అయ్యారు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డం స్టార్ట్ చేశారు. అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రిని తిట్టారు. నిజానికి ఇలా బూతులు తిట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో కొత్త కాదు. వైసీపీలో కూడా అదే రేంజ్ లో తిట్టే ఎమ్మెల్యేలున్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ తిట్లను సమర్థించుకోవడానికి దేవుడ్ని కూడా ఈ రొంపిలోకి లాగారు అయ్యన్నపాత్రుడు.
తన ప్రసంగంలో ''చెత్తనాకొడుకు'' అనే పదప్రయోగం చేశారు అయ్యన్నపాత్రుడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా తిట్టడం తప్పే. వైసీపీ జనాలు కూడా ఎక్కడా తగ్గడం లేదు కాబట్టి ఈ తిట్ల దండకాన్ని వదిలేద్దాం. కానీ తన పదప్రయోగానికి అయ్యన్నపాత్రుడు చెప్పిన లాజిక్ మాత్రం పరమ చెత్తగా ఉంది.
ముఖ్యమంత్రి జగన్ ను అయ్యన్నపాత్రుడు తిట్టలేదంట. చర్చిలో ఫాదర్ ''ఓ మై సన్'' అంటారు కదా, అలా అయ్యన్నపాత్రుడు కూడా జగన్ ను ''నా కొడకా'' అని అన్నారంట. అంతే తప్ప అది తిట్టుకాదంట. తన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నాయని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
చర్చిలో ఫాదర్ సంభోదనకు, బహిరంగ సభలో అయ్యన్నపాత్రుడు కండకావరంతో చేసిన వ్యాఖ్యలకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన జగన్ ను తిట్టిన వీడియోలు యూట్యూబ్ లో కోకొల్లలు ఉన్నాయి. అయితే ఇలా దేవుడ్ని అడ్డం పెట్టుకొని ఆయన తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడాన్ని మాత్రం ఎవ్వరూ సహించరు.
మాటకు మాట.. దెబ్బకు దెబ్బ
మరోవైపు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఇప్పటికే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే టైమ్ లో అటుగా వచ్చిన బుద్ధా వెంకన్న, జోగి రమేష్ మధ్య తోపులాట జరిగింది. అయ్యన్నపాత్రుడిపై ఉన్న ఆగ్రహానికి బుద్ధా వెంకన్న బుక్కయ్యారు.
తర్వాత పంచాయతీ డీజీపీ కార్యాలయానికి మారింది. చంద్రబాబు నివాసంపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిపై కూడా ఫిర్యాదుచేశారు వైసీపీ నేతలు. జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయ్యన్నపాత్రుడిపై పోలీసులు ఆగ్రహం
మరోవైపు అయ్యన్నపాత్రుడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హోం మినిస్టర్ ను తిట్టే క్రమంలో పోలీసులపై కూడా అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. ఎస్పీ స్థాయి అధికారిని కూడా ''నా కొడుకు'' అన్నారు. పోలీసులెవ్వరూ హోం మంత్రికి సెల్యూట్ చేయరని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు మొత్తం వివాదానికి కారణమైన అయ్యన్న మాత్రం తిరిగి అదే పోలీసులకు ఫోన్ చేసి, తనకు అదనపు భద్రత కావాలని కోరారు.