భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, కర్ణాటక సీఎం బొమ్మైల మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. సుబ్రమణ్యస్వామిపై కర్ణాటక సీఎం స్పందిస్తూ ఆయనొక ఫ్రీలాన్స్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యానించగా, అందుకు ప్రతిగా స్వామి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఇటీవలే కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మైని ఉద్దేశించి, నీలా బూట్లు నాకి సీఎం పదవిని పొందలేదు అంటూ సుబ్రమణ్యస్వామి స్పందించడం హాట్ టాపిక్ గా మారుతోంది.
బీజేపీ సీఎంను ఉద్దేశించి బీజేపీ ఎంపీనే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. మోడీ ప్రభుత్వం అనుసరించే కొన్ని విధానాలను బాహాటంగా విమర్శించేందుకు వెనుకాడే వ్యక్తి కాదు సుబ్రమణ్యస్వామి. కాంగ్రెస్ హాయంలో కొన్ని విధానాలను ఎలా విమర్శించే వారో, ఇప్పుడు కూడా అలానే స్పందిస్తూ ఉన్నారు.
ఉత్తరాఖండ్ ఆలయాలపై బీజేపీ ప్రభుత్వ పెత్తనం, పెట్రోల్ ధరలు వంటి అంశాలపై స్వామి విరుచుకుపడ్డారు. నేపాల్, శ్రీలంకలతో పోల్చినా ఇండియాలో పెట్రో ధరలు భారీగా ఉన్నాయనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ విషయం బీజేపీ వ్యతిరేక పక్షాలకు ఆయుధంగా మారుతోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఉన్నారు. బీజేపీ ఎంపీనే ఇలా స్పందిస్తున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో బొమ్మై స్పందించారు. సుబ్రమణ్యస్వామిని ఒక ఫ్రీలాన్స్ పొలిటీషియన్ గా అభివర్ణించారు. సొంత పార్టీలపై ఎదురుతిరిగి మాట్లాడటం ఆయనకు కొత్త కాదన్నారు. ఈ కామెంట్లపై స్వామి ఘాటుగా రిప్లై ఇచ్చారు.
బొమ్మై ముఖ్యమంత్రి పదవి పొందిన తీరును ఎద్దేవా చేశారు. బూట్లు నాకి సీఎం అయ్యావంటూ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తే.. గతంలో కాంగ్రెస్ సీఎంలను కాంగ్రెస్ ఎంపీలే కించపరిచిన వైనాలూ వంటివి గుర్తుకు రావొచ్చు.