తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడ మున్సిపాలిటీ ఎన్నిక జరిగింది. అప్పట్లో ఎక్కడా స్థానిక ఎన్నికల నిర్వహణకు టీడీపీ ఇష్టపడలేదు.
అప్పట్లోనే జరగాల్సిన ఎంపీటీసీ-జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి చంద్రబాబు అనాసక్తిని ప్రదర్శించింది. అప్పటి ఎస్ఈసీ కూడా ఈ విషయంలో అప్పట్లో కోర్టులను ఆశ్రయించిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం వచ్చాకే ఆ ఎన్నికల రచ్చ జరిగింది, జరుగుతూనే ఉంది!
ఆ సంగతలా ఉంటే..టీడీపీ హయాంలో ఒకే ఒక మున్సిపాలిటీ ఎన్నికను నిర్వహించారు. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు. కాకినాడ మున్సిపాలిటీకి అప్పట్లో ఎన్నికలను నిర్వహించారు. వాటిల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ వార్డుల్లో విజయం సాధించి, మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా కాకినాడ మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోనే ఉంది. ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా సత్తా చూపించలేకపోయింది.
రాష్ట్రం మొత్తం మీద కూడా ఒకటీ రెండు చోట్లకు మించి నెగ్గలేకపోయింది. చైర్మన్ పీఠాలను సొంతం చేసుకునేంత సీన్ లేకపోయింది. ఎలాగో కాకినాడ పీఠం టీడీపీ చేతిలో ఉందనుకుంటే, ఇప్పుడు అక్కడ కూడా చెక్ పడేట్టుగా ఉందని సమాచారం.
కాకినాడ మున్సిపాలిటీ వార్డు మెంబర్లు తిరుగుబాట అట. మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మొత్తం 34 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో సమావేశం అయినట్టుగా సమాచారం. ఈ నంబర్ తో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.