మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతల ఎదుటే ఆ పార్టీ నాయకులు తన్నుకున్నారు. సమావేశం కాస్త రచ్చరచ్చ అయ్యింది. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేసింది. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది.
కళ్యాణదుర్గంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల కన్వీనర్ల ఎంపిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుతో పాటు కళ్యాణదుర్గం పార్టీ ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఉమామహేశ్వరనాయుడు వర్గీయులపై హనుమంతరాయ చౌదరి అనుచరులు కుర్చీలతో దాడులకు తెగబడ్డారు. అగ్రనాయకులు వారించినా ఎవరూ వినిపించుకోలేదు. ఉమా అనుచరులకు గాయాలయ్యాయని సమాచారం. దీంతో ఉమామహేశ్వరనాయుడు పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
పథకం ప్రకారమే తమ అనుచరులపై దాడి చేసినట్టు ఆరోపించారు. సమావేశాన్ని ఉమామహేశ్వరనాయుడు అనుచరులు బహిష్కరించడం చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా కళ్యాణదుర్గం టీడీపీ వర్గవిభేదాలు తీవ్రస్థాయిలో నెలకున్నాయి. తనను కాదని 2019లో ఉమామహేశ్వరనాయుడికి టికెట్ ఇవ్వడాన్ని హనుమంతరాయ చౌదరి జీర్ణించుకోలేకపోతున్నారు. 2009, 2014లో హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేశారు. 2014లో ఆయన గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో హనుమంతరాయ చౌదరిని పక్కన పెట్టి, అదే సామాజిక వర్గానికి చెందిన ఉమామహేశ్వరనాయుడిని టీడీపీ దగ్గరికి తీసుకుంది.
అయినా ఫలితం లేకపోయింది. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ గెలుపొందారు. ప్రస్తుతం ఆమె జగన్ కేబినెట్లో మంత్రి. ఇదిలా వుండగా కళ్యాణదుర్గంలో పార్టీ శ్రేణులు పరస్పరం కుర్చీలతో దాడికి దిగడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పార్టీ చేస్తుందా? లేక ప్రేక్షకపాత్ర పోషిస్తుందా? అనేది తేలాల్సి వుంది.