తెలంగాణాలో కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర ప్రభుత్వ వేట స్టార్ట్ అయిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు ఇవాళ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలే నిదర్శనమని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ఢీ అంటే ఢీ అని కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దాడులు చేయొచ్చని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఇటీవల కేసీఆర్ భరోసా నింపేందుకు యత్నించారు.
తమపై బీజేపీ కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని, తమ చేతల్లోని ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీన్ని బలపరిచేలా ఇవాళ మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేశారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గంగుల ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దాడులకు ఈడీ తెగబడిందని అధికార పార్టీ మండిపడుతోంది.
గంగులతో పాటు ఆయన సోదరుల ఇళ్లలోనూ ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం గంగుల దుబాయ్‌లో ఉన్నట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో అక్రమ గ్రానైట్ తవ్వకాలపై ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారస్తుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
హైదరాబాద్, కరీంనగర్‌లలో మొత్తం 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ దాడిగా టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం టీఆర్ఎస్, బీజేపీ మధ్య మరింత వైరాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందో అనే ఉత్కంఠ నెలకుంది.