తీరు మార్చుకోని జేసీ బ్ర‌ద‌ర్స్!

నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడే రాజకీయ నేతల్లో జేసీ బ్రదర్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటార‌నే సంగ‌తి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత కొన్నాళ్లుగా సైలెంట్ గానే ఉన్నా…

నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడే రాజకీయ నేతల్లో జేసీ బ్రదర్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటార‌నే సంగ‌తి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత కొన్నాళ్లుగా సైలెంట్ గానే ఉన్నా ఆయ‌న తమ్ముడు  జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ స్థాయికి పడిపోయిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు అధికారులపై నోరు జారే ధోర‌ణిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. త‌ను పెద్ద‌ సంఘసంస్కర్తను అంటూ పెద్ద లెక్చ‌ర్లిస్తూనే..  త‌మ‌దైన ధోర‌ణిని మాత్రం మార్చుకోవ‌డం లేదు ప్ర‌భాక‌ర్ రెడ్డి.  

వీరి తాజా బాధితుడు అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్. ఆమె పై త‌న ప్ర‌తాపం చూపించాల‌ని చూశారు తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. తీరా.. క‌లెక్ట‌ర్ 'ఇక వెళ్లండి..' అని చెప్ప‌డంతో త‌న చేతిలో ఉన్న కాగితాల‌ను విసిరేసి అధికారుల‌తో గొడ‌వ ప‌డ్డారు ప్ర‌భాక‌ర్ రెడ్డి. అధికార పార్టీ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారని..తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని పెద్దస్వరంతో ఊగిపోయారు. అంత‌లోనే.. మీకు దయచేసి మొక్కుతా.. ప్రజలను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటూ నాట‌కీయ డ్రామా న‌డిపించారు.

తాడిప‌త్రి శివారులోని స‌జ్జ‌ల‌దిన్నె గ్రామంలోని భూస‌మ‌స్య‌పై గ‌తంలో కంప్లెంట్ చేసినా స్పందించ‌టం లేద‌ని బాధ‌ప‌డుతున్న జేసీ.. దాదాపు 40 సంవ‌త్సరాల పాటు తాడిప‌త్రిని గుపెట్లో పెట్టుకుని ఎందుకు ప‌రిష్కారించ‌లేద‌నే విష‌యాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించుకోవాలి. త‌న చేతిలో అధికారం ఉన్న‌ప్పుడే స్థానిక స‌మ‌స్య‌ల‌ను స‌వ్యంగా ప‌రిష్కారించింటే ఇప్పుడు ఇబ్బందులు వ‌చ్చేవి కాదు కదా అంటున్నారు తాడిప‌త్రి ప్ర‌జ‌లు. అధికారంలో ఉన్నా లేక‌పోయిన అధికారుల‌ను బెదిరించి మాట వినక‌పోతే అక్ర‌మ కేసుల‌ను వేయించ‌డం జేసీ బ్ర‌ద‌ర్స్ కు వెన్నెతో పెట్టిన విద్య‌.

ప్ర‌జా స‌మ‌స్య‌ల కంటే త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం అధికారుల‌ను బెదిరించడంతో హీరోల‌యిపోవ‌చ్చ‌ని అనుకుంటూ ఉంటారు జేసీ బ్ర‌ద‌ర్స్. మ‌రి వీరిపై ఏవైనా చ‌ర్య‌లు తీసుకుంటే.. ఆ పై క‌క్ష సాధింపులు అంటూ గ‌గ్గోలు పెట్టి మ‌రో రాజ‌కీయాన్ని షురూ చేయ‌డ‌మూ వీరికి అల‌వాటే!