అన్నయ్యను పొమ్మంటారా? పొగబెడతారా?

మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అన్న ఎంపీ కోమటిరెడ్డి మాట నిజమైంది. ఆయన శాపం ఫలించింది. సొంత పార్టీకి శాపం పెట్టడమే కాకుండా, పార్టీకి ద్రోహం చేసి కమలం పార్టీ…

మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అన్న ఎంపీ కోమటిరెడ్డి మాట నిజమైంది. ఆయన శాపం ఫలించింది. సొంత పార్టీకి శాపం పెట్టడమే కాకుండా, పార్టీకి ద్రోహం చేసి కమలం పార్టీ నుంచి పోటీ చేసిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని చెప్పడమే కాకుండా గెలవాలని కోరుకున్న వెంకటరెడ్డి జాతకం ప్రస్తుతం అధిష్టానం చేతుల్లో ఉంది. తన జాతకం ఎలా ఉంటుందోనని వెంకటరెడ్డి కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అధిష్టానం ఆయన్ని నేరుగా పార్టీ నుంచి వెళ్లి పొమ్మంటుందా? పొమ్మనలేక పొగబెడతారా? అనేది తేలాల్సి ఉంది. పార్టీ అధినాయకత్వం తీసుకొనే నిర్ణయాల కోసం వెంకటరెడ్డి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఏఐసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది… వెంకటరెడ్డి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది. కోమటిరెడ్డి వ్యవహారం పైన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేశ్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి షోకాజ్ నోటీస్ ఇచ్చామని..సమాధానం ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందని పేర్కొన్నారు. వెంకటరెడ్డి నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ కి క్రమశిక్షణ ముఖ్యమని చెప్పిన జై రాం రమేష్ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, మునుగోడు ఫలితాల తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేదు. 

వెంకట రెడ్డికి ఏఐసీసీ షోకాజ్ జారీ చేసింది. పది రోజుల సమయం ఇచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం వెంకటరెడ్డి ఈ నోటీసుకు సమాధానం ఇచ్చారని సమాచారం. తాను సుశిక్షుతడైన కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నానని, అయినా తనకు పార్టీలో గుర్తింపు లేదంటూ వివరణ లేఖలో పేర్కొన్నారు. తారక్ అన్వర్ కు పంపిన సమాధానంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగించిన భారత్ జోడో యాత్రకు దూరంగా ఉన్నారు. దీన్ని రాహుల్ గాంధీ గుర్తించారు. దీనికి స్పందించిన వెంకటరెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చిన తరువాత తాను ఎలా యాత్రలో పాల్గొంటానని..క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత స్పందిస్తానని చెబుతున్నారు. 

దీని ద్వారా ఆయన రాజకీయ నిర్ణయం ఏంటనేది ఆసక్తి గా మారుతోంది. ఇదే సమయంలో మునుగోడు ఓటమి రివ్యూ వేళ..కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ గా విమర్శలు మొదలయ్యాయి. రాజగోపాల్ రెడ్డి ఓటమికి సోదరుడు, ఎంపీ వెంకట్ రెడ్డి కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెంకట్ రెడ్డి నోటి దురుసు మరో మైనస్ పాయింట్ అంటున్నారు. కోమటిరెడ్డి ఆడియో కాల్ లీక్ కావడం ప్రచారం సమయంలో కలకలం రేపింది. పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలని కోరడం దెబ్బతీసింది. ఈ ఆడియో కాల్ అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి బాగా డ్యామేజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రాజగోపాల్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించారు.

ఆమెకు పోలైన ఓట్లు తక్కువే అయినా.. ఓటమికి కారణమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. తమ పార్టీని మోసం చేసి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు ఆత్మ సంతృప్తి చెందుతున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు.. రాజ్ గోపాల్ రెడ్డి ఓటమికి, బీజేపీకి ఎదురుదెబ్బకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ విజయంతో వచ్చే సార్వత్రిక ఎన్నిలకు టీఆర్ఎస్ మరింత సమరోత్సహాంతో రెడీ అవుతుండగా.. లోపాలను సరిదిద్దుకుని బరిలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి.