ఎప్పుడు దించేస్తారో సీఎంల‌కే తెలీదు..గ‌డ్క‌రీ హాట్ కామెంట్స్!

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత నితిన్ గ‌డ్క‌రీ కామెంట్స్ ఆస‌క్తిని రేపుతున్నాయి. రాజ‌కీయ నేత‌లెవ‌రూ ఆనందంగా ఉండ‌లేరంటూ గ‌డ్క‌రీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఏదో య‌థాఫ‌లంగా గ‌డ్క‌రీ ఈ కామెంట్స్…

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత నితిన్ గ‌డ్క‌రీ కామెంట్స్ ఆస‌క్తిని రేపుతున్నాయి. రాజ‌కీయ నేత‌లెవ‌రూ ఆనందంగా ఉండ‌లేరంటూ గ‌డ్క‌రీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఏదో య‌థాఫ‌లంగా గ‌డ్క‌రీ ఈ కామెంట్స్ చేసినా… ఇటీవ‌లి కాలంలో బీజేపీ వాళ్లు వ‌ర‌స‌గా సీఎంల‌ను మారుస్తున్న నేప‌థ్యంలో.. ఆయ‌న మాట‌లు సొంత పార్టీపై సెటైర్ గా మారుతున్నాయి. 

త‌మ ప‌ద‌వీకాలం ఎంతో సీఎంల‌కే తెలియ‌డం లేదంటూ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించ‌డంతో సొంత పార్టీ సీఎంల‌పై ఆయ‌న సానుభూతి వ్యక్తం చేసిన‌ట్టుగా మారింది.

'మంత్రులం అవుతామో లేదో అనే సంధిగ్ధంలో ఎమ్మెల్యేలు ఆనందంగా లేరు. మంచి డిపార్ట్ మెంట్లు ద‌క్క‌లేద‌నే అసంతృప్తితో ఉన్నారు మంత్రులైన వారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే బాధా వారికి ఉంటుంది. ఇక సీఎంల‌యిన వారేమో.. తాము ఎంత కాలం ఆ ప‌ద‌విలో ఉంటామో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు…' అంటూ గ‌డ్క‌రీ చెప్పిన ఈ పొలిటిక‌ల్ జోక్ ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఒక‌ర‌కంగా గ‌డ్క‌రీ చెప్పిన జోక్ చాలా వ‌ర‌కూ బీజేపీకే వ‌ర్తిస్తోంది. దేశంలోని బీజేపీ సీఎంలు ఇప్పుడు ఒక‌ర‌కంగా ఈ ధోర‌ణిలో ఉన్నారు. అధిష్టానం ఎప్పుడు ఎవ‌రిని మారుస్తుందో తెలియ‌ద‌న్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. 

గ‌త కొన్ని నెల‌ల్లో ఐదు మంది సీఎంలు మారిపోయారు! ఇటీవ‌లి కాలంలోనే మూడు రాష్ట్రాల్లో సీఎంల‌ను మార్చేసింది బీజేపీ. తీర‌థ్ సింగ్ రావ‌త్, య‌డియూర‌ప్ప‌, రూపానీలు దిగిపోయారు. వారి స్థానంలో కొత్త వారు వ‌చ్చారు. అయితే కొత్త వారిని కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌ద‌వుల్లో ఉంచవ‌చ్చ‌నే టాక్ ఇప్ప‌టికే వినిపిస్తోంది.

బొమ్మైని క‌ర్ణాట‌క సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలూ అంతంత మాత్ర‌మే. ఇక గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నిక‌ల వ‌ర‌కే ఉంచుతార‌ని, అక్క‌డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రొక‌రిని కొత్త సీఎంగా చేస్తార‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ఊపందుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీ ముందుగా సీఎం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే రోజులు దాదాపు గ‌తించాయి. 

మోడీనే త‌నే సీఎం అభ్య‌ర్థి అన్న‌ట్టుగా ప్ర‌చారాల‌కు వెళ్తున్నారు. కొన్ని చోట్ల అది క‌లిసి వ‌చ్చింది. మ‌రి కొన్ని చోట్ల బీజేపీ అధికారానికి ఆమ‌డ దూరంలో నిలుస్తోంది. ఇంకోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంల మార్పుల నేప‌థ్యంలో గ‌డ్క‌రీ వ్యాఖ్యానం సొంత పార్టీపై మంచి సెటైర్ లా పేలుతోంది!