తమ నాయకులు చంద్రబాబు, లోకేశ్ సతీమణులు భువనేశ్వరి, బ్రాహ్మణిలను ప్రత్యర్థులతో తిట్టించాలని టీడీపీ నేతలు తహ తహలాడుతున్నారు. అందుకే సీఎం సతీమణి వైఎస్ భారతిని భూదందా రొంపిలోకి టీడీపీ నేతలు లాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూస్కామ్‌లో ఆధారాలుంటే భారతి పేరు తీసుకొచ్చినా ఇబ్బంది లేదని, ఉద్దేశ పూర్వకంగానే రాజకీయాల్లోకి లాగడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతికి సంబంధం వుందంటూ టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణి మద్యం మత్తులో కొట్టుకున్నారంటూ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలు భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా విశాఖలోని మధురవాడలో సుమారు రూ.1,600 కోట్ల విలువజేసే భూకుంభకోణం జరిగిందని, అందులోకి వైఎస్ భారతి పేరును టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు తీసుకొచ్చారు. భారతి సమక్షంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జగన్ పెదనాన్న కుమారుడు అనిల్‌రెడ్డి మధ్య గొడవ జరిగిందంటూ ఆరోపణలు చేయడం గమనార్హం.
సీబీఐ జోక్యం చేసుకుని సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం గమనార్హం. పదేపదే వైఎస్ భారతి పేరును వివాదాల్లోకి లాగడం వెనుక టీడీపీ ఉద్దేశం ఏమైనప్పటికీ, ఇందుకు కౌంటర్‌గా వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి, కోడల్ని కూడా తీసుకొస్తారని ఎందుకు గ్రహించడం లేదో అర్థం కాదు.
ఎన్టీఆర్ కూతుర్ని, మనుమరాలిని ఎవరూ ఏమీ అనకూడదని ఆశిస్తున్న వాళ్లు, ప్రత్యర్థి పార్టీ నాయకుడి కుటుంబానికి చెందిన మహిళలను కూడా గౌరవించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యంగా వుందని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని వైసీపీ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో, దాన్ని అడ్డుకునేందుకు భూదందాలను తెరపైకి తెస్తున్నారనే విమర్శలున్నాయి.