హైకోర్టుకు ప్ర‌భుత్వ బెదిరింపు!

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి సంబంధించి హైకోర్టు ఆంక్ష‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సోమ‌వారం రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే ఆంక్ష‌ల స‌డ‌లింపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించిన అంశాల‌ను చూస్తే… హైకోర్టును బెదిరించేలా…

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి సంబంధించి హైకోర్టు ఆంక్ష‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సోమ‌వారం రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే ఆంక్ష‌ల స‌డ‌లింపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించిన అంశాల‌ను చూస్తే… హైకోర్టును బెదిరించేలా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పిటిష‌న్‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్‌కుమార్ దాఖ‌లు చేశారు. తీర్పులోని నాలుగు అంశాల‌ను తొల‌గించాల‌ని పిటిష‌న్‌లో కోరారు.

ప‌ర్యావ‌ర‌ణం హితం కోరి హుస్సేన్‌సాగ‌ర్‌, ఇత‌ర జ‌లాశ‌యాల్లో పీఓపీ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంపై హైకోర్టు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే హైకోర్టు నిషేధాన్ని కాద‌ని హుస్సేన్‌సాగ‌ర్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం నిర్వ‌హించి తీరుతామ‌ని కొన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే త‌మ ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాయి. ఈ నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ పిటిష‌న్ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని.. హు స్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఒక వేళ హైకోర్టు త‌న ఉత్తర్వుల్లో స‌డ‌లింపులు ఇవ్వ‌క‌పోతే జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను కూడా ఈ పిటిష‌న్‌లో పేర్కొన‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆంక్ష‌లు స‌డలించ‌కుండా ట్యాంక్ బండ్ వైపు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని  పిటిషన్‌లో పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి.. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని కోర్టు దృష్టికి ప్ర‌భుత్వం తీసుకెళ్లింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది.

ఇందు కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిన విష‌యాన్ని కూడా పిటిష‌న్‌లో పేర్కొన‌డాన్ని గ‌మ‌నించొచ్చు. మొత్తానికి మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని కోర్టును నేరుగా ఈ పిటిష‌న్ హెచ్చ‌రించింద‌ని న్యాయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.