సరిగ్గా నెల రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది సైరా. సాహో టైపులో ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. మరి సాహో నుంచి సైరా నేర్చుకున్న పాఠాలేంటి?
భారీ బడ్జెట్ సినిమాలకు ఎట్టిపరిస్థితుల్లో నెగెటివ్ టాక్ రాకూడదు. ఏమాత్రం చిన్న బ్యాడ్ టాక్ వచ్చినా అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. సాహోకు ఇలానే మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. వీకెండ్ ప్లస్ హాలిడే సీజన్ కావడంతో ప్రస్తుతానికి వసూళ్లు బాగున్నప్పటికీ ఇవాళ్టి నుంచి ఈ సినిమా అసలు రంగు బయటపడుతుంది. నెగెటివ్ టాక్ ప్రభావం కచ్చితంగా పడుతుంది. మరోవైపు సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ సైరా యూనిట్ నిశితంగా గమనిస్తోంది.
సాహో తర్వాత వస్తున్న అతిభారీ చిత్రం సైరానే. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది యూనిట్. ఇందులో భాగంగా కాస్త ఎక్కువగా ఉన్న రన్ టైమ్ పై దృష్టిపెట్టింది. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను తెరపై చూపాలి, అందులోనూ గతంలో ఎక్కడా ఎవరూ చూపని పాత్ర అది.. అందుకే చాలా రీసెర్చ్ చేసి మరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీని బైటకు తీశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీన్స్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అమితాబ్ వంటి స్టార్ అట్రాక్షన్ కూడా ఉంది కాబట్టి.. అందరికీ న్యాయం చేయడానికి కొంత లెంగ్త్ ఎక్కువ తీసుకున్నారు. పోరాట సన్నివేశాలతో రన్ టైమ్ ఇంకాస్త పెద్దదైంది. అంతా కలిపి 3 గంటల రన్ టైమ్ కు చేరుకుంది.
సరిగ్గా ఇక్కడే డైలమాలో పడింది సైరా టీమ్. ధైర్యం చేసి 3 గంటల రన్ టైమ్ తో సినిమాను విడుదల చేయాలా లేక ట్రిమ్ చేసి ఓ 15 నిమిషాలు కట్ చేయాలా అనే ఆలోచనలో ఉంది. సాహో సినిమాకు కూడా ఆఖరి నిమిషంలో 8 నిమిషాలు కట్ చేసిన సంగతి తెలిసిందే. సైరా విషయంలో ఇలా ఆఖరి నిమిషం వరకు నాన్చకుండా ముందుగానే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే రన్ టైమ్ పై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు కంటెంట్ చేరవేత విషయంలో కూడా సాహోను చూసి జాగ్రత్తపడుతోంది సైరా టీం. ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ ఉత్తరాదిన కొన్ని ప్రాంతాలకు సినిమా కంటెంట్ ను సకాలంలో చేర్చలేకపోయింది సాహో యూనిట్. ఫలితంగా మొదటిరోజు నార్త్-ఇండియాలో కొన్ని చోట్ల షోలు పడలేదు. ఫస్ట్ డే వసూళ్లపై ఆ ప్రభావం కనిపించింది. లేదంటే సాహో వసూళ్లు బాలీవుడ్ లో మరో 2 కోట్లు అదనంగా వచ్చి ఉండేవి. ఇలాంటి సమస్య తలెత్తకుండా సైరా విషయంలో 3 రోజులు ముందే కంటెంట్ ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంటే విడుదలకు 8-9 రోజుల ముందే సెన్సార్ పూర్తిచేయాలన్నమాట.
సినిమా హిట్ అయితే మూవీకి సంబంధించిన ప్రతి అంశం ప్లస్ అవుతుంది. రిజల్ట్ తేడా కొట్టినప్పుడు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడాల్సి వస్తుంది. సాహో విషయంలో ఇదే జరుగుతోంది. సైరా విషయంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మెగా కాంపౌండ్ పై ఉంది. ఏదేమైనా తమ సినిమా కంటే నెల రోజుల ముందు సాహో లాంటి పెద్ద సినిమా రావడం సైరా యూనిట్ కు చాలా అడ్వాంటేజ్ అవుతోంది. సాహో నుంచి సైరా యూనిట్ ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతోంది.