ఏపీ ప్రభుత్వం మరో వెనుకంజకు తెరతీసింది. ఏపీలో మటన్ మార్ట్‌ల ఏర్పాటుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ప్రచారానికి మంత్రి ప్రకటన బలం కలిగించినట్టైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం అభాసుపాలు అయిందని చెప్పొచ్చు. అసలు తన నిర్ణయాన్ని వెనక్కు తీసునేంత తప్పు ఏముందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ఈ నెల 9న సాక్షి దినపత్రికలో “వచ్చేస్తున్నాయ్ “మటన్‌మార్ట్”లు శీర్షికతో కథనం ప్రచురించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పత్రిక కావడంతో ప్రభుత్వ విధానాలకు సంబంధించి ముందస్తు సమాచారం ఆ పత్రికలో వచ్చిందని అందరూ భావించారు. ఈ కథనంలో వివరాలు నమ్మదగ్గట్టే ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేసినట్టు సాక్షి కథనాన్ని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ కథనంలో ఏమున్నదంటే…
“అందుబాటు ధరల్లో ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలు (మటన్ మార్టు) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు అవుతాయి. మలి దశలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు” అని రాసుకొచ్చారు. అంతేకాదు, మటన్ మార్ట్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయని కూడా వెల్లడించారు.
“4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. 120 చదరపు విస్తీర్ణంలో పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 జీవాలను వధించేందుకు వీలుగా వధశాలతో పాటు డ్రెస్సింగ్, జీవాల అవయవాల (గ్రేడ్స్) వారీగా కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు రూపొందించారు”
ప్రభుత్వమే మటన్ మార్టుల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుందంటే, మరికొందరు ప్రభుత్వం మటన్ వ్యాపారం చేయడం ఏంటనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సంబంధితశాఖ మంత్రి అప్పలరాజు మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో మటన్‌మార్ట్‌ల ప్రతిపాదనే లేదని తేల్చి చెప్పడం గమనార్హం.
“ఆంధ్రప్రదేశ్‌లో మటన్ మార్ట్‌ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ద్వారానే హైజినిక్ కండిషన్‌లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మినీ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించాం” అని ఆయన వివరణ ఇచ్చారు.
ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనుకున్నా… అందుకు అవకాశం ఇచ్చింది మాత్రం సొంత మీడియా కథనమే అని మంత్రి గారు విస్మరించినట్టున్నారు. మొత్తానికి సాక్షి విశ్వసనీయతను మటన్ ఖైమాను కొట్టినట్టుగా మంత్రి కొట్టారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.