మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీదారుల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశ్‌రాజ్ ఆదివారం విందు సమావేశం నిర్వహించడంపై బండ్ల గణేశ్ పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్లపై అదిరిపోయే పంచ్ విసిరి, తమ జోలికొస్తే ఎలా వుంటుందో జస్ట్ ట్రైల్ చూపారని ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పాలని కోరుతూ బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా వీడియో షేర్ చేశారు. ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని పరోక్షంగా ప్రకాశ్‌రాజ్‌కు మనవి పేరుతో బండ్ల గణేశ్ హితవు చెప్పడం టాలీవుడ్లో చర్చకు దారి తీసింది. బండ్ల గణేశ్ తమకు నీతులు చెప్పడంపై ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు.
బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. అసోసియేషన్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ నిర్వహించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు కొంతమంది ఆర్టిస్టులను లంచ్‌కు పిలిచినట్టు ఆయన తెలిపారు. వారితో సమస్యలపై దాదాపు మూడు గంటల పాటు చర్చించినట్టు ప్రకాశ్‌రాజ్ తెలిపారు.
బండ్ల గణేశ్ వ్యాఖ్యలు నిజంగానే తనను షాక్‌కు గురి చేసినట్టు ఆయన ఆశ్చర్యపోతూ అన్నారు. గుజరాత్‌తో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడికి అందరూ వెళ్తున్నారని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. మరి దాని గురించి బండ్ల గణేశ్ ఏం మాట్లాడుతారు? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని, ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తానని బండ్లకు హెచ్చరిక జారీ చేశారు.