కవచం తొలగింది కోర్టుకు వెళ్లాల్సిందే

తన మీద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ,  ఇన్నాళ్లు ఆయన కవచం వెనుక ఉండి వాటిని తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కవచం జారిపోయింది.  విచారణ నుంచి దూరం ఉండడం అసాధ్యం.   కోర్టు…

తన మీద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ,  ఇన్నాళ్లు ఆయన కవచం వెనుక ఉండి వాటిని తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కవచం జారిపోయింది.  విచారణ నుంచి దూరం ఉండడం అసాధ్యం.   కోర్టు గడప తొక్క వలసి రావడం అనివార్యం. అరెస్టు అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇది ఇప్పుడు గవర్నర్ పదవి నుంచి దిగి పోయిన, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కళ్యాణ్  సింగ్ పరిస్థితి.

మోడీ సర్కారు గవర్నర్ల విషయంలో తన తాజా నిర్ణయంతో నలుగురు గవర్నర్లను ఇంటికి పంపింది. ఒక్క కల్రాజ్ మిశ్రాను మాత్రం రాజస్తాన్ కు బదిలీచేసి.. మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. దాంతో నలుగురు పాతగవర్నర్లు ఇంటిముఖం పట్టారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్ లాగానే.. ఈ నలుగురిలో రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ కూడా ఉన్నారు.

1992 డిసెంబరు 6న ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ కట్టడాన్ని నేలమట్టం చేసేసిన ఘటనకు సంబంధించి ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అప్పట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, బాబ్రీ కూల్చివేతకు కారణమయ్యారంటూ.. అప్పటి భాజపా నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్ లపై క్రిమినల్ కేసులను సుప్రీం మళ్లీ విచారణకు స్వీకరించింది. 2017లో ఈకేసులను తిరిగి రివైవ్ చేశారు.

అయితే అప్పట్లో కల్యాణ్ సింగ్ రాజస్తాన్ గవర్నర్ గా ఉండడంతో రాజ్యాంగంలోని 361వ అధికరణం ప్రకారం.. విచారణ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపు ఆయన గవర్నర్ గా ఉన్నంతకాలమూ కొనసాగుతుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలతో ఆయన గవర్నర్ పదవీకాలం మంగళవారంతో ముగుస్తుంది.

1992లో అయోధ్యలోని బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసి రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు.. అద్వానీ, జోషి వంటి నాయకులు ఘటనాస్థలంలోనే ఉన్నారు. అప్పట్లో కల్యాణ్ సింగ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కల్యాణ్ సింగ్ శాంతి భద్రతల్ని ఉపేక్షించి వారికి సహకరించారని, ఆ ఇద్దరు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేది వారి మీద ఉన్న క్రిమినల్ అభియోగాలు. ఇప్పుడు కల్యాణ్ సింగ్ గవర్నర్ గిరీ పోయిన తర్వాత.. కోర్టుకు హాజరు కావాల్సిందే.