సూపర్‌స్టార్ అనే బిరుదును తండ్రి నుంచి సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో మహేశ్‌బాబుకు విశేష సంఖ్యలో అభిమానులున్నారు. తన పని తాను చేసుకుపోతూ వివాదాలకు దూరంగా, ఫ్యామిలీకి దగ్గరగా ఉండే మహేశ్‌బాబు అంటే చిత్ర పరిశ్రమలో అందరూ గౌరవిస్తారు. తాజాగా మహేశ్‌బాబు అంటే కేవలం రీల్ హీరోనే కాదు..సోషల్ మీడియా హీరో కూడా అయ్యారు.
యువతతో పాటు ఫ్యామిటీ ఆడియెన్స్‌లో మహేశ్ అంటే ఓ క్రేజ్. ఇప్పుడాయన సోషల్ మీడియాలో రికార్డు సృష్టించారు. ట్విటర్‌లో అత్యధికంగా కోటి మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. ఈ ఘతన సాధించిన తొలి దక్షిణాది హీరోగా ఆయన రికార్డులకెక్కారు.
తమిళ హీరో ధనుస్ 91 లక్షల మందితో దక్షిణాదిలో రెండోస్థానంలో ఉన్నారు. దీన్నిబట్టి దక్షిణాదిలో మహేశ్‌కున్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది. ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన హీరోగా మహేశ్ రికార్డు సాధించడంపై సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మహేశ్ డైలాగ్స్ డెలవరీ, నటనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే ఆయనకు ఎక్కువ సంఖ్యలో అభిమానులను తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ అనే సినిమా కోసం మహేశ్‌బాబు రెడీ అవుతున్నారు.