ఉద్యోగుల్లో సంతోషం.. ప్రభుత్వానికి సంకటం..!

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వారిని పర్మినెంట్ చేసే క్రమంలో ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి అవసరమైన పరీక్షలకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ప్రొబేషన్ డిక్లేర్ చేసిన…

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వారిని పర్మినెంట్ చేసే క్రమంలో ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి అవసరమైన పరీక్షలకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ప్రొబేషన్ డిక్లేర్ చేసిన మరుక్షణం వారికి జీతాలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్యోగులకే నెలవారీ జీతాలివ్వడానికి ఇబ్బంది పడుతున్న ఆర్థిక పరిస్థితి రాష్ట్రానిది. కొత్తగా పర్మినెంట్ అయిన ఉద్యోగులకు జీతాలు పెంచాలంటే అది కత్తిమీద సామే.

అదే సమయంలో ఆల్రెడీ పర్మినెంట్ అయిన ఉద్యోగులు పీఆర్సీ కోసం, సీపీఎస్ రద్దు కోసం వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా ప్రభుత్వం ఉద్యోగం హోదా పొందిన వాళ్లు ఊరికే ఉంటారా అంటే అనుమానమే. వారు కూడా ఉద్యమ బాట పట్టే అవకాశముంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 15,004 నూతన గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ఏకంగా 1.34 లక్షల మందికి ఉపాధి కల్పించింది. హోదాలు, విధులు వేర్వేరు అయినా అందరికీ రూ.15వేలు జీతం ఫిక్స్ చేసారు. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామంటూ సచివాలయాల ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారు. అయితే వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయో లేదో అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

ఎట్టకేలకు వారిని పర్మినెంట్ చేసే దిశగా ప్రభుత్వం డిపార్ట్ మెంట్ టెస్ట్ లకు అనుమతిచ్చింది. ఈ నెలాఖరుతో పరీక్షలు పూర్తవుతాయి. 100కి 40మార్కులు తెచ్చుకున్నవారంతా పాస్ అవుతారు, ఫెయిలైన వారికి ప్రొబేషన్ పొడిగిస్తారు. పాస్ అయి ప్రొబేషన్ డిక్లేర్ అయినవారందరికీ వెంటనే పే స్కేల్ అమలు చేయాల్సి వస్తుంది. ఇతర సదుపాయాలు కల్పించాలి. సీఎల్స్, ఈఎల్స్ వంటి వ్యవహారాలుంటాయి.

మా సంగతేంటి..?

సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు సరే, మరి మా సంగతేంటి అని నిలదీస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే సీపీఎస్ రద్దుకోసం ఓ దఫా రోడ్లెక్కారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్, రెండేళ్లవుతున్నా ఇంకా కాలయాపన చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే సాహసోపేత నిర్ణయం తీసుకున్న జగనే, సీపీఎస్ రద్దు నిర్ణయం కూడా తీసుకుంటారనే భరోసా ఉద్యోగుల్లో ఉంది. మరోవైపు పీఆర్సీ కూడా మెడపై కత్తిలా వేలాడుతోంది.

అసలే రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంటే, పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల జీతాలు పెంచడమంటే మాటలు కాదు. దీనిపై ఇంకా ప్రభుత్వ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే కార్యక్రమం మొదలు పెట్టిన ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు.. ఈ రెండు అంశాలు మరికొన్నాళ్లు హైలెట్ కాబోతున్నాయి. మరి జగన్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.