ఇంతవరకూ తెలుగుదేశం పార్టీ జోస్యాలను అభిమానులో, లేక రాజకీయ విశ్లేషకుల అవతారంలో ఉంటూ ఆ పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న వారో చెబుతూ వచ్చారు. ఇపుడు ఆ బాధ్యతలను కొత్తగా మాజీ మాంత్రి గంటా శ్రీనివాసరావు స్వీకరించారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం తధ్యమని గంటా అంటున్నారు.
ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుదని కూడా ఇదే ఊపులో ఆయన జోస్యం చెప్పేశారు. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఒకే ఒకసారి అది కూడా ఎన్టీయార్ పార్టీ పెట్టిన కొత్తల్లోనే టీడీపీ గెలిచింది. ఇపుడు చూస్తే అక్కడ సీన్ వేరేగా ఉంది.
అయినా సరే గంటా టీడీపీ గెలిచి తీరుతుంది అని ఘంటాపధంగా చెబుతున్నారు అంటే అది జోస్యమే అనుకోవాలి. ఇప్పటిదాకా తిరుపతిలో టీడీపీ గెలుపుని ఏ ఆక్టోపస్ కూడా చెప్పని వేళలో గంటా ఇలా అనడం క్యాడర్ కి హుషారు తెప్పించడానికేనా అన్న మాట వినిపిస్తోంది.
ఇక మునిసిపాలిటీ, పంచాయతీలల్లో వైసీపీ గెలిచినా ఆ ఎన్నికలు జరిగిన తీరు సరికాదు అన్నట్లుగా కూడా గంటా మాట్లాడుతున్నారు. మరి బ్యాలెట్ మీద ఎన్నికలూ ఈవీఎం ల మీద ఎన్నికలూ కూడా జనం తీర్పు ఏంటో చెప్పేశాయి. తిరుపతిలో ఎన్నికలు జరిగేది ఈవీఎంల మీదనే. అయినా అక్కడ వేరే తీర్పు వస్తుందని గంటా ఎలా ఆశిస్తున్నారో, ఆయన ధీమా ఏంటో మరో రెండు వారాల్లో తేలిపోనుంది.