భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను అనుకున్న పని విజయవంతంగా పూర్తి చేశాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదనుకున్నాడు. చేయలేదు. పైగా తమ్ముడికి ఓటేయాలని చెప్పాడు. అంతకంటే ఘోరం మునుగోడులో కాంగ్రెస్ గెలవదని తేల్చిపారేశాడు. ప్రచారం చేయకుండా ఉండటంకోసం ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడు. సరిగ్గా ప్రచార పర్వం ముగియగానే తిరిగి వచ్చాడు. వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావడంతో ప్రస్తుతం పార్టీ నేతల్లో రెండు విషయాలపై చర్చ జరుగుతోంది.
ఒకటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో వెంకట్ రెడ్డి పాల్గొంటాడా అని, రెండో విషయం ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై రేపటితో గడువు ముగియనుండటంతో.. ఆయన ఏ వివరణ ఇస్తాడోనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సమయంలో అక్టోబర్ 21న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబంతో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. మునుగోడు బై పోల్స్ ప్రచారం గడువు ముగియగానే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడటం లేదని, కలవడం లేదని సమాచారం.
పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చాక, అనంతర పరిణామాలతో పార్టీ నేతలతో ఆయన మాట్లాడతాడని తెలుస్తోంది. సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సహకారం అందించాలని, ఉప ఎన్నికల్లో మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతకు వెంకట్ రెడ్డి కాల్ చేసి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఎంపీకి షోకాజ్ నోటీసులిచ్చింది. వివరణ ఇచ్చేందుకు పది రోజులు గడువు ఇవ్వగా, ఆ గడువు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుంది. మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని చెప్పవచ్చు.
తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది తమ తొలి విజయమని మునుగోడు విజయంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి పార్టీ తరపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు పారిపోయాడు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఆయన స్టార్ క్యాంపైనర్ కూడా. కానీ తమ్ముడి మీద ప్రేమకొద్దీ ఆయన ప్రచారం చేయలేదు. పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. తనను కాకుండా రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేశారన్న అక్కసును తీర్చుకున్నాడు. పార్టీ అధిష్టానం వెంకట్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన అన్ని తప్పులూ చేశాడు. వెంకట్ రెడ్డి మీద వేటు వేస్తేనే అది ఇతర నాయకులకు గుణపాఠంగా ఉంటుంది. మరి అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందా? లేకపోతే విడిచిపుచ్చుతుందా? చూడాలి.