ఈటెల పరిణామాలపై కన్నేసిన కమలం

ప్రత్యర్థి పార్టీలో లుకలుకలు పుడితే ఏ పార్టీకైనా సరే పండగ పండగ గానే ఉంటుంది. ప్రధానంగా ఆ పార్టీలో అసంతృప్తితో మండిపడే వారిని తమ చెంతకు చేర్చుకోవచ్చుననే ఆశ ఉంటుంది. లేదా, ఆ పార్టీలో…

ప్రత్యర్థి పార్టీలో లుకలుకలు పుడితే ఏ పార్టీకైనా సరే పండగ పండగ గానే ఉంటుంది. ప్రధానంగా ఆ పార్టీలో అసంతృప్తితో మండిపడే వారిని తమ చెంతకు చేర్చుకోవచ్చుననే ఆశ ఉంటుంది. లేదా, ఆ పార్టీలో లుకలుకలు నెమ్మదిగా వారిని దెబ్బతీస్తాయని నమ్మకం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా వేచిచూస్తోంది.

కేసీఆర్ క్యాబినెట్ లోని మంత్రి ఈటెల రాజేందర్ చుట్టూ కొన్ని రోజులుగా చెలరేగుతున్న వివాదం.. తమ పార్టీకి ఎంతమేరకు లభించగలదో అంచనా వేయడానికి భాజపా కసరత్తు చేస్తోంది. ఈటెల చుట్టూ ముసురుకున్న వివాదం, చిలికి చిలికి గాలివానగా మారి, క్యాబినెట్ నుంచి ఆయనను బయటకు పంపిస్తే గనుక తమకు లాభం అనేది భాజపా అంచనా. అదే జరిగితే  ఈటలను కమలదళంలో చేర్చుకోవడానికి  వారు ముందు వరుసలో ఉంటారు అనేది తద్యం.

ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ వార్తలు వస్తున్నరోజు నుంచి మంత్రిపదవిపై వేటు పడుతుందని ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతోంది. ఈ అసంతృప్తితోనే ఈటెల రాజేందర్ కూడా తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చాలా భావోద్వేగంతో స్పందించారు. తాను సొంతంగా ఎదిగిన నాయకుడు అని చెప్పుకున్నారు. పరోక్షంగా తన రాజకీయ జీవితానికి ఎవరి దయాదాక్షిణ్యాలతో సంబంధం లేదని సంకేతం ఇచ్చినట్లు అయింది.

కేసీఆర్ మీద తిరుగుబాటు లాగా అది ధ్వనించడంతో.. మళ్లీ కేసీఆరే మా నాయకుడు సాయంత్రానికి సవరణ ప్రకటన కూడా చేశారు ఈటెల. వ్యవహారం అక్కడితో ఆగిపోలేదు. ఈటెల నివాసానికి ఆయన అభిమానులు పోటెత్తుతున్నారు. నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో ప్రతిరోజూ వస్తున్నారు. తమనేత ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమో అని మద్దతుగా నిలబడుతున్నారు. ఈటెల రాజేందర్ కూడా ప్రతిరోజు పలువురి నుంచి సలహాలు తీసుకుంటున్నారు.

ఈ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతుందో అని భాజపా వేచిచూస్తోంది. తెరాస నుంచి నిష్క్రమణ తప్పనిసరి అయినట్లయితే తాము అక్కున చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బలం పెంచుకోవడం గురించి చాలా కసరత్తు చేస్తున్న భాజపా, ఈటెల రాజేందర్ వచ్చినట్లయితే రెడ్ కార్పెట్ వేస్తుందనడంలో సందేహం లేదు.

సినిమా రివ్యూ: సాహో