కొత్త విధానాన్ని రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు రెండు నెలలకు పైగా కసరత్తు చేసింది. మొత్తానికి కొత్త విధానం ప్రకారం టెండర్లను ఆహ్వానించి, కొన్నిరోజుల కిందటే వాటిని ఆమోదించింది కూడా! టెండర్లను పిలిచి ఆహ్వానించిన దానికంటే వేగంగానే ఆ టెండర్లను రద్దుచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. నిర్దిష్టంగా ఒకరిని బాధ్యులను చేయకుండా, ఏకంగా ట్రాక్టర్లో ఉన్న వారందరూ కూడా ఇసుక రవాణా చేసుకోవచ్చు అంటూ లాకులు ఎత్తివేయడం వలన, సామాన్యులను విచ్చలవిడిగా దోపిడీ చేస్తారని ప్రజలు భయపడుతున్నారు.
ఇసుక టెండర్లు నిర్వహించిన సందర్భంలోనే, నిల్వ కేంద్రాల నుంచి కొనుగోలుదారుల చెంతకు ఇసుక రవాణా చేయడానికి కూడా టెండర్లు పిలిచారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఒక కిలోమీటరుకు 1.90 రూపాయలు చాలంటూ కొన్ని జిల్లాల్లో టెండర్లు నమోదయ్యాయి. నమ్మశక్యంగా లేకపోయినా ప్రభుత్వం ఆమోదించాల్సి వచ్చింది. ఎనిమిది జిల్లాల్లో మరో ఐదు జిల్లాల్లో కొత్తగా టెండర్లు పిలిచారు. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరిగిందో ఏమోకానీ, రెండు మూడురోజుల వ్యవధిలోనే మొత్తం అన్ని టెండర్లను రద్దుచేశారు.
ఇసుక రవాణాకు సంబంధించి ట్రాక్టర్‌లు ఉన్న ఎవరైనా సరే తరలించడానికి వీలుగా అనుమతి ఇచ్చారు. దీనివలన రవాణా ముసుగులో సామాన్య ప్రజలను దోచుకోవడం పెరుగుతుందని భయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక నిల్వ కేంద్రాల నుంచి వినియోగదారుల వరకు, కిలోమీటరుకు 4.90 రూ.ల వంతున ప్రభుత్వం నిర్ణయించింది, ప్రాక్టికల్ గా అది అవుతుందనేది సందేహమే. ఎందుకంటే వాహనాలు అందుబాటులో లేవని లేదని రకరకాల సాకులు చెబుతూ, వాహనదారులు కొనుగోలుదారుల నుంచి విపరీతంగా వసూలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
నిర్దిష్టంగా ఒక చేతిలో కాంట్రాక్టు ఉంటే గనుక, ప్రభుత్వంతో ఒప్పుకున్న ధరకు రవాణా చేయాలనే బాధ్యత వారికి ఉంటుంది. అందులో తేడాచేస్తే కాంట్రాక్ట్ పోతుందనే భయం కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటివేమీ ఉండవు. అడిగిన వారికి మాత్రమే ఇసుక రవాణా అవుతుంది. సామాన్యుడి నడ్డి విరుగుతుంది.
జిల్లా అంతటికీ ఒకే ఒక కాంట్రాక్టర్ కు అప్పగించడం అనేది కాకుండా, అన్ని వాహనాలను ఇసుక రవాణాకు అనుమతించడం మంచి పద్ధతి అయినప్పటికీ.. దీని వలన దొంగ మార్గాల్లో దోపిడీతో ప్రజలను వేధించకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి వ్యవహారాల్లో లో చిన్నతేడా వచ్చినా ప్రభుత్వం పరువు సాంతం సర్వనాశనం అవుతుందని వారు గ్రహించాలి.