ఈసారి కూడా స్పీకర్ పదవి శ్రీకాకుళం జిల్లాదే..!

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు వేళయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ కుర్చీకి మాత్రం రెక్కలు రావు. కానీ ప్రస్తుతం స్పీకర్ ఛైర్ లో ఉన్న తమ్మినేని సీతారాం.. ఆఖరి అవకాశం అంటూ సీఎం…

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు వేళయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ కుర్చీకి మాత్రం రెక్కలు రావు. కానీ ప్రస్తుతం స్పీకర్ ఛైర్ లో ఉన్న తమ్మినేని సీతారాం.. ఆఖరి అవకాశం అంటూ సీఎం జగన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. 

జగన్ ఎంత ఒత్తిడి అయినా తట్టుకోగలరు కానీ.. తమ్మినేని ప్రయోగించిన ఆఖరి ఛాన్స్ అనే సెంటిమెంట్ కి ఆయన కూడా తలొగ్గినట్టే కనిపిస్తోంది. అంటే స్పీకర్ కుర్చీ నుంచి ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారన్నమాట. అయితే ఖాళీ అయిన స్పీకర్ పదవి ఎవరికి కట్టబెడతారనేదానిపైనే ఇప్పుడు చర్చంతా.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా స్పీకర్ పదవి కూడా చేతులు మారబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేనిని తప్పించి, ఆ స్థానాన్ని ధర్మాన ప్రసాదరావుకు ఇస్తారనే టాక్ నడుస్తోంది.

ఇదే జరిగితే మరోసారి స్పీకర్ పదవి శ్రీకాకుళం జిల్లా నేతకు దక్కినట్టవుతుంది. చివరి ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన తమ్మినేని సీతారాంను కేబినెట్ లోకి తీసుకుంటారు. అయితే ధర్మాన సోదరులిద్దరికీ పదవులుంటాయా అనేదే అనుమానం.

ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. చివరివరకూ మంత్రి పోస్ట్ కోసం ప్రయత్నించిన ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇప్పుడు ప్రసాదరావుని స్పీకర్ గా తీసుకుంటే, కృష్ణదాస్ కి ఉద్వాసన తప్పకపోవచ్చు. తమ్మినేని విషయానికొస్తే.. సీదరి అప్పలరాజును తప్పించి, ఆ స్థానంలో తమ్మినేనిని కూర్చోబెడతారనే ప్రచారం సాగుతోంది.

లాభసాటి పదవి కాకపోయినా..

స్పీకర్ పదవితో ఒరిగేదేమీ ఉండదు, తరిగేదేమీ ఉండదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి సహా సభలోకి రావడానికి, పోవడానికి అనుమతివ్వడం, అందరితో దండాలు పెట్టించుకోవడం, ప్రొటోకాల్ మినహా ఇతర లాభాలేవీ ఉండని పోస్ట్ అది. 

వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు, జగన్ హయాంలో కూడా అలాంటి గుర్తింపునే కోరుకున్నా అది సాధ్యపడలేదు. కనీసం ఇప్పుడు స్పీకర్ పదవి ఇచ్చినా అదే పదివేలు అనుకునేట్టు ఉన్నారాయన. అందుకే ధర్మానను జగన్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారని తెలుస్తోంది. తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని తేలుతోంది.