బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోందనే విషయం మాత్రం కొన్నిరోజులుగా స్పష్టంగా తెలుస్తోంది. కలసి కాపురం చేస్తాం, కలసి పోరాడతాం అంటూ కలసి ప్రెస్ మీట్లు పెట్టినంత ఈజీగా లేదు వీళ్ల కలయిక. ఆమధ్య బీజేపీ జాతీయ నేతలకు బాకాలూదిన పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయారు.
కరోనా లాక్ డౌన్ మొదలైన టైమ్ లో, లాక్ డౌన్ లో అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్న టైమ్ లో పవన్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మోడీ ప్రసంగానికి పవన్ స్వయంగా ఓ టీజర్ వదిలేవారు, ఆయన ఏం చెప్పినా ఆహా ఓహో అంటూ కేంద్రానికి డబ్బా కొడుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసేవారు. కొన్నిరోజులుగా ఏదో తేడాకొట్టింది. జనసేన సోషల్ మీడియా అకౌంట్లలో బీజేపీ ప్రస్తావనే కనుమరుగైంది.
ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు పడుతున్నాయి కానీ, కేంద్రాన్ని సమర్థిస్తూ ఓ ముక్కకూడా చెప్పట్లేదు జనసేనాని. తాజాగా మోడీ రేషన్ సరకుల ప్రసంగం తర్వాత కూడా పవన్ కల్యాణ్ ఆహా ఓహో అని అనలేదు. బీజేపీని, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లని పొగడటంలో రాష్ట్ర బీజేపీ నేతల కంటే ముందుండే పవన్ కల్యాణ్, ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నట్టు.
స్వర్ణకారులకు ఏంచేశారు, ప్రైవేట్ ఉపాధ్యాయులను పట్టించుకున్నారా లేదా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పవన్, మోడీ ప్రసంగం పూర్తయినా కనీసం ఇప్పటివరకు ఓ ట్వీట్ వేద్దామని అయినా అనుకోక పోవడం విచిత్రమే. నాలుగు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆమె ప్రముఖ పాత్రపై వార్తలు రావడం.. ఇవన్నీ పవన్ కి ముందే తెలుసా అనే అనుమానాలొస్తున్నాయి.
చైనాతో పోరు, చైనా యాప్స్ పై నిషేధంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించ లేదు. జనసైనికులకి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు రాలేదు. ఈ వ్యవహారం చూస్తుంటే బీజేపీకి, జనసేనకి మధ్య ఏదో జరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది.
పవన్ ని కమలదళం దూరం పెట్టిందా, లేక జనసేనానే కాషాయానికి దూరమవుతున్నారా అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కొన్నికొన్నిసార్లు గ్యాప్ రావడం లేటవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా. ఇప్పుడు జనసేన-బీజేపీ మధ్య అదే జరుగుతోంది.