మహిళా భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. మహిళా సాధికారత కోసం ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. మంత్రివర్గంలో కూడా మహిళలకు చోటిచ్చింది. ఓవైపు ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే, మరోవైపు మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఓ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ స్థాయి వ్యక్తి చేయిచేసుకున్న ఘటన నెల్లూరులో తాజాగా వెలుగుచూసింది.
నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ ఆఫీస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది ఉషారాణి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఉద్యోగులంతా విధిగా మాస్కులు ధరించి ఆఫీసుకు రావాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో మాస్క్ లేకుండా వచ్చిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను ఉషారాణి ప్రశ్నించింది.
ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశ్నించేసరికి అతడి అహం దెబ్బతిన్నట్టుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. టేబుల్ పై ఉన్న ఓ ఇనుప వస్తువు తీసుకొని దాడిచేశాడు. వెంటనే సహచర ఉద్యోగులు కలుగజేసుకొని భాస్కర్ ను బయటకు పంపించారు.
ఇది జరిగి 3 రోజులవుతుంది. డిప్యూటీ మేనేజర్ దాడితో షాక్ లోకి వెళ్లిన ఉషారాణి, ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి జరిగినప్పుడు రికార్డైన సీసీటీవీ ఫూటేజ్ ను కూడా అందించింది.
ఫూటేజ్ చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ గా దృష్టిపెట్టింది. అతడ్ని వెంటనే సస్పెండ్ చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. సదరు మహిళా ఉద్యోగి దివ్యాంగురాలనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమెపై దాడిచేశాడు డిప్యూటీ మేనేజర్.