ఆ గ‌ట్టా? ఈ గ‌ట్టా?… తేల్చుకోండి!

ఎవ‌రికి ఏ భాష‌లో చెబితే అర్థ‌మ‌వుతుందో మంత్రి కేటీఆర్‌కు బాగా తెలుసు. సినీ డైలాగ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న విరుచుకు ప‌డ్డారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చివ‌రి రోజు మంగ‌ళ‌వారం ఆయ‌న సంస్థాన్…

ఎవ‌రికి ఏ భాష‌లో చెబితే అర్థ‌మ‌వుతుందో మంత్రి కేటీఆర్‌కు బాగా తెలుసు. సినీ డైలాగ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న విరుచుకు ప‌డ్డారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చివ‌రి రోజు మంగ‌ళ‌వారం ఆయ‌న సంస్థాన్ నారాయ‌ణ‌పూర్ చౌర‌స్తాలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేటీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్‌ల‌తో  చెల‌రేగిపోయారు. ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన రంగ‌స్థ‌లం సినిమాలోని పాట‌లోని చ‌ర‌ణాల‌ను తీసుకుని బీజేపీపై మాట‌ల దాడికి దిగారు.

మునుగోడులో ఓ వ్య‌క్తి అమ్ముడు పోవ‌డం వ‌ల్ల ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌కు మోదీ కాళ్ల ద‌గ్గ‌ర రాజ‌గోపాల్‌రెడ్డి పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని మండిప‌డ్డారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని వెట‌క‌రించారు. టీఆర్ఎస్ మాత్రం గ‌రీబోళ్ల పార్టీగా చెప్పుకొచ్చారు. గ‌రీబోళ్ల నాయ‌కుడు కేసీఆర్‌ను చూసి టీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరారు.

మునుగోడులో రెండు సిద్ధాంతాలు, భావ‌జాలాల మ‌ధ్య పోటీ జ‌రుగుతోంద‌న్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య పోటీ కానేకాద‌న్నారు. ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టే నాటికి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.400 ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు రూ.1200కు పెరిగిందన్నారు. అలాగే మోదీ రాక మునుపు పెట్రోల్ లీట‌ర్ రూ.70 వుంటే, ఇప్పుడు రూ.110కి పెరిగింద‌న్నారు. బీజేపీకి ఓటు వేస్తే కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరుగుతాయ‌న్నారు.

పేద‌ల కోసం ప‌ని చేసేదెవ‌రో ఆలోచించి 3వ తేదీ ఓటు వేయాల‌ని కోరారు. ఏ మాత్రం ఆగం కావ‌ద్ద‌ని సూచించారు. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ సినిమా డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. రంగ‌స్థ‌లం సినిమాలోనిది ఈ పాట అని ఆయ‌న అన్నారు. అంద‌రూ సినిమాలు చూస్తుంటారు క‌దా? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారానికి స‌మ‌యం ముంచుకొస్తున్న నేప‌థ్యంలో అన్ని రాజ‌కీయ ప‌క్షాలు వేగం పెంచాయి. రోడ్‌షోలు, మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, త‌మ‌దైన రీతిలో ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు, అలాగే త‌మ‌ను గెలిపిస్తే జ‌రిగే మంచి ఏంటో వివ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మునుగోడు మొగ్గు ఎటు వైపో మ‌రి!