మార్చి నెలాఖరు, ఏప్రిల్ నెలల్లో కరోనా చేత తీవ్రంగా బాధింపబడిన దేశాల్లో ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలు నిలిచాయి. చైనా నుంచి డైరెక్టుగా ఈ దేశాలకు కరోనా వైరస్ ఎగుమతి అయ్యిందని పరిశోధకులు తేల్చారు. ఆ ప్రభావంతో ఈ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఇటలీలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏకంగా 30 వేల మందికి మించి కరోనాతో మరణించారక్కడ. ఆ క్రమంలో ఆ దేశాలు ఏమైపోతాయో అనే ఆందోళనలు కూడా వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆదేశాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటున్న దశకు చేరుకుంటున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉన్న వైనాన్ని గమనించవచ్చు.
ఇటలీలో ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 200కు చేరింది. ఒక దశలో రోజుకు ఏడెనిమిది వేల కేసులతో మొత్తం మూడు లక్షల కేసుల మార్కుకు చేరిన స్పెయిన్ లో ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య మూడు నుంచి – ఐదువందల మధ్యకు చేరింది. మొత్తం రెండు లక్షల కేసులో దాదాపు 9 వేల మరణాలు నమోదైన జర్మనీలో కూడా ప్రస్తుతం రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఐదారు వందల లోపు స్థాయికి చేరింది.
ఇలా యూరప్ లో కరోనాతో అల్లాడిపోయిన ఈ దేశాల్లో పరిస్థితి సద్దుమణుగుతూ ఉంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో అత్యంత తీవ్రంగా ఈ దేశాల్లో కరోనా విజృంభించింది. మే నెలాఖరు నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. జూన్ పూర్తవుతున్న సమయానికి కొత్త కేసుల సంఖ్య దాదాపు తగ్గిపోతోంది. మరి కరోనా కు కల్లెం వేయడంలో ఈ దేశాలు ఎలాంటి వ్యూహాలను అనుసరించాయో.. ఇండియా కూడా గమనించాల్సి ఉంది.