సీఎం వైఎస్ జగన్ కొవిడ్ విషయంలో ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన ముఖానికి మాస్క్ ధరించడానికి ఎందుకు అనాసక్తిగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ మాస్క్ ఎందుకు ధరించడం లేదో ప్రెస్మీట్లో విలేకరులు ప్రశ్నించాలని సూచించారు.
ట్రైనీ ఐఏఎస్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను, రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీటికి సంబంధించి పత్రికల్లో పక్కపక్కనే ఫొటోలు ప్రచురించారు. ఈ ఫొటోల్లో రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో పాటు ట్రైనీ ఐఏఎస్‌లు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించి కొవిడ్ నిబంధనలు తూచా తప్పక అమలు చేయడం కళ్లకు కట్టినట్టు కనిపించింది.
ఇక జగన్‌ను కలిసిన సందర్భంలో కొవిడ్-19 నిబంధనలను ఏ మాత్రం పాటించలేదు. సీఎం జగన్ సహా యువ ఐఏఎస్‌లు కూడా మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించలేదు. పాలకుడి ప్రతి నడవడికను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. సాక్ష్యాత్తు సీఎం జగనే కొవిడ్-19 నిబంధనలు పాటించకపోతే…సామాన్యులకేం సందేశాన్ని పంపుతారు?
పైపెచ్చు యువ ఐఏఎస్‌లకు జగన్ నీతి సందేశాలు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు కనిపిస్తాయని, వాటిని సరిదిద్దుకుంటూ ముందడుగు వేయాలని యువ ఐఏఎస్‌లకు సీఎం జగన్ సూచించడం గమనార్హం. వ్యవస్థలో లోపాల గురించి చెబుతున్న జగన్ తనలోని లోపాలను గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కొవిడ్-19 నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు నెత్తీనోరూ కొట్టుకుని చెబుతుంటే…సీఎం మాత్రం వాటిని తుంగలో తొక్కడం భావ్యమా? మరోవైపు మాస్క్‌లు ధరించకపోతే వెయ్యి రూపాయాలు జరిమానా విధిస్తామని కలెక్టర్లు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల బ్రెజిల్ దేశాధ్యక్షుడు మాస్క్ ధరించకపోతే ఆ దేశ న్యాయస్థానం ఎంత ఘాటుగా స్పందించిందో తప్పక తెలుసుకోవాలి. దేశంలో కరోనా కేసులు ఎక్కువై ప్రజలు ప్రమాదంలో పడుతుంటే దేశాధ్యక్షుడే మాస్క్ ధరించకపోతే ఎలా అని జెయిర్ బోల్సొనారేను న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే తమ ఆదేశాలను ధిక్కరిస్తే రోజుకు రూ.30 వేలు చొప్పున జరిమానా విధిస్తామని దేశాధ్యక్షుడు జెయిర్ బోల్సొనారోను న్యాయస్థానం హెచ్చరించింది. జగన్‌ను కూడా న్యాయస్థానాలు అలా హెచ్చరిస్తే తప్ప మాస్క్ ధరించరా?