సుమారు రెండుకోట్ల రూపాయల విలువ చేసే అసెంబ్లీ ఫర్నిచర్, కంప్యూటర్లను తన సొంతానికి తరలించుకువెళ్లి.. వాటిని తన కొడుకు షోరూంలో వాడుకుంటూ దొరికిపోయిన కోడెల శివప్రసాదరావు.. మొత్తానికి ఒక మెట్టు తగ్గారు. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెత చందంగా.. తప్పు తనదికాదు ప్రభుత్వానిదే అంటూ.. ఫర్నిచర్ ను తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా.. కోర్టులో దావావేసిన కోడెల… తనను తప్పుపడుతున్న వారితో ఇంచుమించు రాజీకి వచ్చారు. పోలీసులు.. తమ నుంచి ఫర్నిచర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని.. తరలించేసిన తర్వాత.. ఇక కోర్టు ద్వారా దొరికే ఉపశమనం పెద్దగా ఉండదని అనుకున్నారో ఏమో.. ‘నన్నిక క్షోభ పెట్టొద్దు.. వదిలేయండి’ అని వేడుకుంటున్నారు.
ఇంత జరిగినా కూడా.. ఆయన ఇంకా.. డొంకతిరుగుడుగానే మాట్లాడుతుండడం మాత్రం విశేషం. ఇప్పటికీ సూటిగా చెప్పడంలేదు. తన తప్పులేదని బుకాయిస్తూనే ఉన్నారు. ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తనకు సంబంధం లేకుండా.. హైదరాబాదు నుంచి ఫర్నిచర్ తరలిస్తున్న భద్రతాధికారులే.. తన క్యాంపు కార్యాలయంలో దించేశారని కొత్తవాదన తెచ్చారు. తన పదవీకాలం పూర్తికాగానే వాటిని తీసుకెళ్లాలని లేఖ రాసినట్లు పాతమాటే వల్లించారు. తన లేఖల్ని పట్టించుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. 37ఏళ్లు నిబద్ధతతో రాజకీయాలు చేశానని, తప్పుడు ఆరోపణలతో క్షోభ పెట్టొద్దని ఆయన కోరుతున్నారు.
కోడెల శివప్రసాదరావు చాలా సీనియర్. నిబద్ధత గల రాజకీయాలు చేసినమాట నిజమే. కానీ.. ఫర్నిచర్ విషయంలో ఆయన చెబుతున్నట్లుగా భద్రతాధికారులు వారంతట వారుగా.. ఆయన క్యాంపు కార్యాలయంలో మొత్తం దించేసి ఉంటే.. ఆ విషయాన్ని అసెంబ్లీ రికార్డుల్లో నమోదుచేయకుండా ఎందుకుండిపోయినట్లు? క్యాంపు కార్యాలయంలో దించిన ఫర్నిచర్.. కొడుకు వ్యాపారంచేస్తున్న షోరూంలో ఎందుకు దొరికినట్లు? వీటికి ఆయన ఏం సమాధానం చెబుతారు?
నన్ను క్షోభ పెట్టొద్దు అని అడిగే తరీకా ఇదికాదు. ‘నేను తప్పు చేయలేదు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..’ అంటే నడవకపోవచ్చు. ఆయనకు నిజంగా క్షోభ అనిపిస్తే గనుక.. ‘ఏదో జరిగిపోయింది.. ఇక నన్ను వదిలేయండి’ అంటే ఒక్కమాటతో పోయేది. కానీ ఈ లేఖతో ఆయన మళ్లీ వివాదం రేపుతున్నట్లుగా ఉంది.