అధికారంలో ఉన్నప్పుడు జరిగిన డ్యామేజ్ కన్నా అధికారం కోల్పోయాకా, తాము ప్రతిపక్షంలో కూర్చున్నాకా జరుగుతున్న డ్యామేజ్ తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బందిపెడుతూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఇప్పుడు మాత్రం అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిల్లో మాజీ స్పీకర్ కోడెల ఫర్నీచర్ వ్యవహారం ముఖ్యమైనది. లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఫర్నీచర్ ను అసెంబ్లీ సీసీ కెమెరాలను సైతం ఆపేయించి, కోడెల ఇంటికి తరలించిన వైనం వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. స్పీకర్ వంటి గౌరవనీయమైన స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి పని చేయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కోడెల కక్కుర్తిపై ప్రజల్లో కూడా తిట్లదండకం వినిపిస్తోంది. అసెంబ్లీ కోసమని విదేశాల నుంచి దిగుమతి చేయించిన ఫర్నీచర్ ను కోడెల తనయుడి బైక్ ల షోరూంలో వాడుతున్న వైనంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో కోడెల శివప్రసాద్ రావు మీద ఆయన తనయుడి మీద కేసులు నమోదు అయ్యాయి. ఫర్నీచర్ ను తిరిగి ఇచ్చేస్తానంటూ కోడెల కోర్టుకు ఎక్కారు.
అది ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కథ. మరి షాపులో ఉన్న ఫర్నీచర్ మాటేంటి? అంటే.. సీజ్ చేసిన షాపు నుంచి ఫర్నీచర్ తీసుకెళ్లడంపై కేసులు పెడతారట! ఆల్రెడీ అక్రమాలు జరుగుతున్నాయని ఆ షోరూమ్ పై కేసులు నమోదయ్యాయి. అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్ ను సిబ్బంది తీసుకెళ్లింది. దీనిపై కూడా కోడెల అండ్ కో రాద్ధాంతం చేయాలని చూస్తుండటం గమనార్హం!
కోడెల లీలలు ఇంతటితో ఆగేలాలేవు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ నే గాక ఆఖరికి ప్లాస్టిక్ కుర్చీలను కూడా సొంతానికి వాడుకున్న వైనం బయటకు వచ్చింది. వీటితోపాటు.. కోడెల కూతురు మధ్యాహ్నభోజనం పథకం అన్నాన్ని తన కంపెనీ ఉద్యోగులకు అమ్ముకున్న వైనం, ప్రభుత్వం సరఫరా చేసిన గడ్డి విషయంలోనూ వీరు స్కామ్ చేయడం.. వంటి వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి.
కోడెల కుటుంబం ఒక్కో వ్యవహారంలో అడ్డంగా దొరికిపోతున్న వైనం తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.