చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సి ఉంది. అది ఆగిపోయిందా, వస్తుందా అనే చర్చను పక్కనపెడితే.. ఆ సినిమాకు సంబంధించి ఓ విలువైన సలహా అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి వెంకీకి ఈ సూచన వచ్చింది.
“దర్శకుడు అభిమాని అయితే ఆ సినిమా బాగా వస్తుంది. లోకేష్ కనగరాజ్ నా అభిమాని. విక్రమ్ సినిమా బాగా తీశాడు. నువ్వు (వెంకీ కుడుముల) కూడా చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నావని విన్నాను. చిరంజీతో ఓ సినిమా చేయాలంటే కేవలం అభిమాని అయితే సరిపోదు. చిరంజీవి ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే లిస్టులో బాలచందర్ ఉంటారు, కె.రాఘవేంద్రరావు కూడా ఉంటారు. ఆ బ్యాలెన్స్ గమనించాలి. చిరంజీవికి స్టార్ డమ్ తెచ్చిన సినిమాల్ని చూడాలి.”
ఓ అభిమానిగా చిరంజీవితో సినిమా చేసేటప్పుడు ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలని వెంకీ కుడుములకు సూచించారు కమల్ హాసన్. చిరంజీవితో సినిమా చేయాలంటే కేవలం అభిమానిగా ఉంటే సరిపోదని, చిరంజీవి కెరీర్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా సినిమా చేయాలని అన్నారు.
తన బ్రదర్ చిరంజీవికి మంచి హిట్ ఇవ్వాలని వెంకీ కుడుములను కోరారు కమల్ హాసన్. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే టాలెంట్ చిరంజీవిలో ఉందని, ఓ అభిమానిగా చిరంజీవికి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత వెంకీ కుడుముల భుజాలపై ఉందన్నారు.