జ‌గ‌న్ స‌ర్కార్‌కు హైకోర్టు ఫైన‌ల్ వార్నింగ్‌

ఉపాధిహామీ ప‌థ‌కం పెండింగ్ బిల్లుల చెల్లింపుల‌కు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఏపీ హైకోర్టు ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీలోపు బిల్లుల‌న్నీ చెల్లించ‌క‌పోతే కోర్టు ధిక్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు…

ఉపాధిహామీ ప‌థ‌కం పెండింగ్ బిల్లుల చెల్లింపుల‌కు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఏపీ హైకోర్టు ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీలోపు బిల్లుల‌న్నీ చెల్లించ‌క‌పోతే కోర్టు ధిక్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు లేక‌పోవ‌డంతో బిల్లుల చెల్లింపుల్లో ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంది. మ‌రోవైపు ప‌నులు చేసి బిల్లుల చెల్లింపుల‌కు నోచుకోక‌పోవ‌డంతో కాంట్రాక్ట‌ర‌ల్లు కోర్టును ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి.

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల విష‌య‌మై కొన్ని నెల‌లుగా న్యాయ‌స్థానంలో వివాదం న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాల‌ని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఖ‌జానాలో డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఏదో ఒక సాకు చెబుతూ ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చింది. ఇక అలా చేయ‌డానికి కూడా వీల్లేన‌న్ని గ‌డువులు ముగిశాయి.

రెండు వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశించ‌గా.. కేవలం 25 కేసుల్లోనే చెల్లింపులు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  సర్పంచ్ అకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్‌కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి స‌ర్పంచుల  వివరాలు ఇస్తే.. వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు విచారణ ఏంటని హైకోర్టు  ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే వారి జీవనాధారం ఏంట‌ని హైకోర్టు ప్రశ్నించింది. 

ఈ నెల 15వ తేదీలోపు చెల్లింపులు చేయ‌క‌పోతే కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. హైకోర్టు ఆదేశాల‌ను మ‌న్నించి బిల్లులు చెల్లిస్తుందా లేక కోర్టు ధిక్క‌ర‌ణ ఎదుర్కొంటుందా? అనే విష‌యం తెలియాలంటే మ‌రో వారం ఎదురు చూడాల్సిందే.