ఒకవైపు బీజేపీ వాళ్లు వినాయకచవితి రాజకీయం చేస్తూ ఉన్నారు. వినాయకపందిళ్లకు అనుమతులు ఇచ్చేయాలని ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో వాళ్లు రాజకీయ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రజలు పండగలు చేసుకోవాలంటూ పిలుపునిస్తారు, మళ్లీ పందిళ్లు కావాలి, మండపాలు కావాలంటున్నారు కమలం పార్టీ వాళ్లు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో నిర్ధాక్షిణ్యంగానే వ్యవహరిస్తున్నాయి. బీజేపీ రాజకీయానికి భయపడేది లేదన్నట్టుగా స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.
పండగలు మళ్లీ జరుపుకుందాం, సంబరాలను ముందు ముందు చేసుకుందామంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే మరి కొన్ని రోజుల పాటు ఎలాంటి మత పరమైన, రాజకీయపరమైన మీటింగులు, సమావేశాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వాటికి మహారాష్ట్ర లో అనుమతి లేదన్నారు. ప్రస్తుతానికి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకే ప్రాధాన్యత అని ఆయన అన్నారు. పరిస్థితి చేయిదాటిపోకుండా చూసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కేరళ ఉదంతాన్ని గుర్తుంచుకోవాలని ఠాక్రే ఒత్తి చెప్పారు. అలాగే ఆలయాలను తెరవాలంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న డిమాండ్లను కూడా ఆయన తప్పు పట్టారు. అలాంటివి మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ బీజేపీ రాజకీయానికి శివసేన ఇస్తున్న జవాబు. మహారాష్ట్రలో ఇప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీనే. అక్కడ కమలం పార్టీ చాలా రాజకీయమే చేస్తోంది. ఆలయాలను మూసి వేశారని, గణేష్ చతుర్థికి పర్మిషన్ అంటూ కమలం నేతలు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. వారికి తోడు ఎంఎన్ఎస్ కూడా జత కలిసింది. అయితే ఈ రాజకీయానికి ఠాక్రే భయపడకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులూ ఉండవని అయన స్పష్టం చేశారు.
ఇటీవలే ఈ అంశం గురించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా స్పందించారు. మతపరమైన అంశాల్లో మినహాయింపులు కావాలంటున్న బీజేపీ నేతలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఠాక్రే స్పందిస్తూ.. మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. మొత్తానికి బీజేపీ రాజకీయాన్ని ఎదుర్కొనడానికి ఠాక్రే సమాయత్తం అవుతున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మినహాయింపులు ఇచ్చేస్తే.. ఆ తర్వాత ఎవరికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమీ రాజీనామా అయితే చేయాల్సిన అవసరం ఉండదు. రాజకీయ లబ్ధి శివసేనకే ఉండవచ్చు. అయినా ఠాక్రే మాత్రం.. తన ప్రాధాన్యత అది కాదని స్పష్టం చేస్తున్నట్టుగా ఉన్నారు.