ఉన్నట్లుండి మళ్లీ లాక్ డౌన్ అంటూ వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి.హైదరాబాద్ లో పరిస్థితిని అదుపులోకి తేవాలంటే మళ్లీ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అధికారులు ముఖ్యమంత్రి కేసిఆర్ కు సూచించారంటూ వార్తలు వినవస్తున్నాయి. లాక్ డౌన్ తీసేసిన తరువాత హైదరాబాద్ లో కరోనా పరిస్థితి అదుపుతప్పింది. నిత్యం వందలాది కేసులు నమోదు అవుతున్నాయి.
ఇవి కాక ప్రయివేటు క్లినిక్స్ లో నమోదు కాని పాజిటివ్ పరిక్షలు ఎన్నో జరుగుతున్నాయని వార్తలు వున్నాయి. ఎక్కడా ఏ ఆసుపత్రి ఖాళీ లేదు. జనం విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా భయం వాట్సాప్ ల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో మరో సారి రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే తప్ప ఫలితం లేదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ స్కూళ్లు, థియేటర్లు, ఐటి సంస్థలు మూతపడే వున్నాయి. కేవలం రెగ్యులర్ దుకాణాలు మాత్రమే తెరచి వున్నాయి. అత్యవసరమైన దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చి, మిగిలినవి బంద్ చేయించాలని, ఏరియాల వారీ కదలికలు రిస్ట్రిక్ట్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.