ప‌వ‌న్‌పై కాపు తూటా!

నాడు ప్ర‌జారాజ్యాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేందుకు ప్ర‌తిప‌క్షాలు ఏ విధ‌మైన వ్యూహాలు ర‌చించాయో, నేడు జ‌న‌సేన‌పై కూడా అవే పున‌రావృతం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌భావాన్ని నామ‌మాత్రం చేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మ‌కంగా…

నాడు ప్ర‌జారాజ్యాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేందుకు ప్ర‌తిప‌క్షాలు ఏ విధ‌మైన వ్యూహాలు ర‌చించాయో, నేడు జ‌న‌సేన‌పై కూడా అవే పున‌రావృతం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌భావాన్ని నామ‌మాత్రం చేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కేవ‌లం కాపు నాయ‌కుడిగా చూపేందుకు వైసీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. అందుకే ఆయ‌న‌పై కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల‌తో రాజ‌కీయ దాడి చేయిస్తున్నారు.

వైసీపీ ట్రాప్‌లో ప‌డిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, వారిపై తీవ్ర‌స్థాయిలో దూష‌ణ‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌తో వైరం కాపుల మ‌ధ్య గొడ‌వ‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నాలు ఊపందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌మావేశమ‌వుతున్నారు. ఈ స‌మావేశం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపింది.

తాను కులాలు, మ‌తాల‌కు అతీతమ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతున్నా, ప్ర‌త్య‌ర్థులు మాత్రం ఆయ‌న్ని అలా వుండ‌నివ్వ‌డం లేదు. కుల‌నాయ‌కుడిగా చూస్తూ, ఆ మేర‌కు ఇత‌ర సామాజిక వ‌ర్గాలు ఆద‌రించ‌ని ప‌రిస్థితిని తీసుకొచ్చేందుకు అధికార పార్టీ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల కాపు మంత్రుల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో దూష‌ణ‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే.

కాపుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌లిగిస్తున్న ప్ర‌యోజ‌నాల‌తో పాటు త‌మ‌పై ప‌వ‌న్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌పై కూడా చ‌ర్చించాల‌ని అధికార పార్టీ కాపు ప్ర‌జాప్ర‌తినిధులు నిర్ణ‌యించారు. ముఖ్యంగా అంబ‌టి రాంబాబు, గుడివాడ అమ‌ర్నాథ్‌, పేర్ని నాని, కొట్టు స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు ప‌వ‌న్‌తో ఆటాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

వైసీపీ వ్యూహానికి ప‌వ‌న్ అజ్ఞానం తోడు కావ‌డంతో అధికార పార్టీ ప‌ని సులువ‌వుతోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌న‌సేన కాస్త కాపుసేన‌గా గుర్తించే వ‌ర‌కూ వైసీపీ నిద్ర‌పోయేలా లేదు. కాపుల్లో చీలిక తెచ్చి, ప‌వ‌న్‌ను డ‌మ్మీ చేయ‌డ‌మే వైసీపీ అంతిమ ల‌క్ష్యం. అందులో భాగంగా ప్ర‌తి మూడు,నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి కాపు ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించ‌డం స‌రికొత్త ఎత్తుగ‌డ‌గా చెప్పొచ్చు.