పని లేని వాళ్ల కోసం చైనా వాడు సృష్టించిన ఒక యాప్ ను యూజ్ చేయడమే కొంతమందికి పనై పోయింది! ఎలాంటి ఉపయోగకరమైన సమాచారం ఇవ్వని ఒక యాప్ కు కొన్ని కోట్ల మంది యూజర్లు ఉండటం విచిత్రమే! అనామకులకు కూడా రాత్రికి రాత్రి గుర్తింపు ఇవ్వడమే దాని విజయం రహస్యం. ఆ వ్యవహారం అక్కడితో ఆగినా అందంగా ఉండేది. అంతకు మించి… అక్కడ లేకి వేషాలే ఎక్కువైపోయాయి. గుర్తింపును వస్తుండటం వరకూ బాగానే ఉంది కానీ, ఆ గుర్తింపు కోసం వెర్రి వెర్రి వేషాలు వేసే వాళ్లు విపరీత స్థాయికి వెళ్లిపోతూ ఉన్నారు. స్థూలంగా కాస్త పెద్ద తరహాలో చూస్తే… టిక్ టాక్ యాప్ ఒక పనికి మాలిన వ్యవహారంలా కనిపించక మానదు. ఒకవైపు చైనీ యాప్స్ ను బహిష్కరించమని పిలుపుల సంగతలా ఉంటే, టిక్ టాక్ లో బయల్పడుతున్న చిల్లర వేషాలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
అనామకులకు బీభత్సమైన ఫాలోయింగ్!
టిక్ టాక్ లో కొంతమంది లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంటున్నారు. మిలియన్ల స్థాయిలో ఫాలోయింగ్ కలిగిన యువతీయువకులు కూడా అక్కడ ఉన్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా పాపులర్ కావాలంటే సెలబ్రిటీలు అక్కడకు ఎంట్రీ ఇవ్వడం ద్వారా దాని పాపులారిటీ పెరుగుతుంది. అయితే టిక్ టాక్ మాత్రం భిన్నం. సామాన్యుల్లో దాని ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిన తర్వాత సెలబ్రిటీలు కూడా టిక్ టాక్ వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ సామాన్యులే మిలియన్ల స్థాయి లో ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంతో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగి తమ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడ్డారు.
ఎలాంటి వారికి ఫాలోయింగ్?
విభిన్న రకాల్లో ప్రతిభను చూపించ గలిగే వాళ్లకు గుర్తింపు దక్కితే అది మంచిదే. రాత్రికి రాత్రి కొంతమంది టాలెంటెడ్ ఫెలోస్ ను స్టార్లుగా చేస్తే.. .అదెవరైనా మంచిదే. టిక్ టాక్ కూడా ఆ తరహాలో కొంత వరకూ మంచే చేసి ఉండొచ్చు. అయితే.. గుర్తింపు కోసమని అక్కడ వెర్రి వేషాలు వేయడం ఎక్కువై పోయింది. ఆ వెర్రి వేషాలకు కామెడీ అనే పేరు రావడంతో.. ఆ వేషాల తీవ్రత మరింత ఎక్కువై పోయింది.
అందానికి తోడు ఏదైనా అభినయించగలిగే అమ్మాయిల ఫాలోయింగ్ కు అక్కడ తిరుగు లేదు. అయితే తమలో ఆ తరహాలో ఏ ఆకర్షణ లేకపోయినా.. ఏదోలా జనాలను ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేసే వాళ్ల దగ్గర నుంచి వేషాలు ఎక్కువై పోయాయి! అర్థం లేకుండా వ్యవహరించే అమ్మాయిలు, ఆడంగి వేషాలు వేసే అబ్బాయిలకు టిక్ టాక్ ద్వారా వచ్చిన గుర్తింపు, వాళ్లను యూట్యూబ్ చానళ్ల వాళ్లు కూడా పోటీలు పడి ఇంటర్వ్యూలు చేస్తుండటాన్ని చూస్తే.. టిక్ టాక్ అంటే వీళ్లా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. టిక్ టాక్ అంతే వీళ్లు ఉంటారేమో అని ఈ వేషాలను భరించలేని వాళ్లు అటు వైపు వెళ్లడదానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంటూ ఉంది.
బూతులే బూతులు..!
పచ్చి బూతులకు అడ్డాగా మారింటి ఈ అప్లికేషన్. ఎవరో కొందరు టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఉండవచ్చు. అయితే బూతుల్లో తమ టాలెంట్ ను ప్రదర్శించే వాళ్లకు టిక్ టాక్ ఒక స్వేచ్ఛా విహారం అయ్యింది. ఆడంగి వేషాలు వేసే అబ్బాయిల తర్వాత, పిచ్చపిచ్చగా బూతులు మాట్లాడే వాళ్లు టిక్ టాక్ స్టార్లు అయిపోతున్నారు. బహుశా జనాలకు వాళ్ల బూతులు ఏమైనా సైకో ప్లజర్ ను ఇస్తున్నాయో ఏమో కానీ కామెడీ పేరుతో బూతులు మాట్లాడే వాళ్లు దుమారం రేపుతున్నారు. వాళ్లకూ విపరీత ఆదరణ కనిపిస్తూ ఉంది. దానికి తోడు లవ్ ఫెయిల్యూర్ కోట్స్ ను చెప్పి, అమ్మాయిలనో-అబ్బాయిలనో ఏకపక్షంగా నిందిస్తూ ఎక్స్ ప్రెషన్లను ఇచ్చే వాళ్లకూ ఫాలోయింగ్ కనిపిస్తూ ఉంది.
డబ్బులొస్తాయా..?
టిక్ టాక్ వీడియోలతో డబ్బుల విషయానికి వస్తే.. ఇది సంపాదించుకోగలిగే వాళ్లకే అవకాశం ఉన్నట్టు. టిక్ టాక్ అధికారికంగా కొన్ని యాడ్స్ ను సంపాదించుకుంటుంది. దాన్ని జనాలు అప్ లోడ్ చేసే వీడియోల సమయంలో డిస్ ప్లే చేస్తుంది. అందులో కొంత వాటాను వీడియోలకు చేసే వాళ్లకు ఇస్తుంది. అది కూడా అందరికీ కాదు. టిక్ టాక్ లో తగినంత పాలోయర్లను కలిగిన వారికే అలాంటి అవకాశం ఉంటుంది. అయితే స్థానికంగా ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగే వాళ్లకు మార్కెటింగ్ అవకాశాలుంటాయి. భారీ స్థాయిలో ఫాలోయింగ్ కలిగిన టిక్ టాకర్లు ప్రైవేట్ ప్రమోషనల్ యాడ్స్ తెచ్చుకునేందుకు అవకాశం ఉండనే ఉంది. ఫలానా యాప్ ను ప్రమోట్ చేయడమో, లేక వేరే వ్యాపారాలను ప్రమోట్ చేయడమో చేస్తే.. అలా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది మేనేజ్ మెంట్ స్కిల్. సొంతంగా ప్రమోషనల్ యాడ్స్ ను తెచ్చుకోవడం ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్లకు టిక్ టాక్ మంచి ఆర్థిక ప్రయోజనకారి. ఇలా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. అయితే భారీ స్థాయిలో ఫాలోయర్లను పొందగలిగిన వాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉండవచ్చు. ఇలా డబ్బులు వచ్చేస్తాయని, చాలా మంది టిక్ టాక్ వైపు వస్తున్నారు కూడా.
లైకుల, ఫాలోయింగ్ కోసం ఫ్రస్ట్రేషన్..!
తమ వీడియోలకు లైకులు రాలేదని, తమకు ఎక్కువ మంది ఫాలోయర్లు రావడం లేదని అక్కడ దుమ్మెత్తి పోసుకునే వాళ్లూ కనిపిస్తారు. తాము ఎంతబాగానో వీడియోలను చేసినా అనుకున్నంత స్థాయిలో అవి వైరల్ కావడం లేదని…తిడుతూ వీడియోలను పెట్టే వాళ్లూ కనిపిస్తారు. ఏడ్చిమొత్తుకుంటూ ఉండే వాళ్లను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఇక కామెంట్ల విషయంలోనూ రచ్చ జరుగుతూ ఉంటుంది. తమ వీడియోల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టారని అంటూ అలా కామెంట్లు పెట్టిన వారిని బూతులు తిట్టే ఘనులు కూడా అక్కడ కనిపిస్తారు. ఏతావాతా.. ఇలాంటి థర్డ్ గ్రేడ్ రచ్చలు అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. దీంతో టిక్ టాక్ పై నెగిటివ్ ఇంప్రెషన్ బాగా ఏర్పడుతూ ఉంటుంది.
సెలబ్రిటీలవీ చిల్లర వేషాలే!
టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆ తరహా వేషాలే వేయాలన్నట్టుగా సెలబ్రిటీలు కూడా అక్కడ వెకిలి వేసాలే వేస్తుండటాన్ని గమనించవచ్చు. జెంటిల్ మెన్ వ్యవహారాలకు టిక్ టాక్ లో చోటే లేదన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అక్కడ ఎంట్రీ ఇవ్వాలంటే క్రికెటర్ అయినా కుప్పి గంతులు వేయాల్సిందే క్లాస్ టచ్ కు అవకాశం లేకుండా, ఊరమాస్ వేషాలే టిక్ టాక్ లో హైలెట్ అవుతూ ఉంటాయి. రాజకీయనేతలు కూడా టిక్ టాక్ రంగంలోకి దిగుతూ ఉన్నారు. మరి వారి వ్యవహారాలు ఎలా ఉండబోతాయో చూడాల్సి ఉంటుంది.
ట్రోల్ టిక్ టాక్.. ఒక ట్రెండింగ్!
టిక్ టాక్ జనాలు వేసే పిచ్చి పిచ్చి వేషాలను, అక్కడ వాళ్లు ఆడే వెర్రి ఆటలను ట్రోల్ చేస్తూ ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో బోలెడన్ని వీడియోలు కనిపిస్తాయి. టిక్ టాక్ లో అలాంటి ఆటలను అన్నింటినీ కలిపి, వారి ట్రోల్ చేస్తూ.. కొంతమంది ఫేస్ బుక్ లో వీడియోలను పెడుతూ ఉంటారు. అవి పక్కా కామెడీగా మారిపోయాయి. టిక్ టాక్ జనాల మీద అలా జోకులేస్తూ ఫేస్ బుక్ లో కొన్ని పేజ్ లు కనిపిస్తాయి. టిక్ టాక్ కామెడీ అలా వాళ్లకు ఉపయోగపడుతూ ఉన్నట్టుంది!
ఇలాంటి చేష్టలు కొంత కాలమే!
నెటిజన్లే కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ నడిచేదే సోషల్ మీడియా. యూట్యూబ్ అయినా, ఫేస్ బుక్ అయినా, ఇన్ స్టాగ్రమ్ అయినా.. ఇన్నాళ్లు మనుగడ సాధించాయంటే, ఇంకా మనుగడ సాధిస్తున్నాయంటే…వాటిల్లో ఎంతో కొంత వ్యాల్యుబుల్ కంటెంట్ ఉండటమే కారణం. యూట్యూబ్ లో బోలెడన్ని ఉపయుక్తమైన వీడియోలు ఉంటాయి. చదువుకు సంబంధించిన కంటెంటే అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఫేస్ బుక్ లోనూ ఫేక్ పోస్టుల హడావుడి ఎక్కువే కానీ, అనేక సంస్థలు అధికారికంగా ఫేస్ బుక్ లో ప్రమోట్ అవుతున్నాయి. ఇక ఇన్ స్టాగ్రమ్ బాగా పుంజుకుంటూ ఉంది. అది ప్రధానంగా ఫొటో షేరింగ్ సైట్ గా నిలుస్తోంది. ఎటొచ్చీ టిక్ టాక్ మాత్రం చిల్లర వేషాలకే అడ్రస్ అవుతోంది. చిలర్ల వ్యవహారాలకు నిర్వచనంగా మారుతూ ఉంది. ఇలాంటి వాటికి ఆదరణ లభించవచ్చు గాక, ఇదంతా కొన్నాళ్లే. జనాలకు కూడా వీటిపై ఆసక్తి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఉపయుక్తకరమైన కంటెంట్ ఇవ్వలేనివి కొన్నాళ్లు వెలిగిపోవచ్చు, ఇదంతా తాటాకు మంటే!