కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని డైలాగులు కొడుతూనే.. పచ్చి కుల రాజకీయాలు చేస్తుంటారంటూ పవన్ కల్యాణ్ నిజస్వరూపాన్ని బైట పెట్టారు మంత్రి కన్నబాబు. దీంతో పవన్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి తన అసలు రూపాన్ని తానే బైటపెట్టుకున్నారు. కులంలేదని చెప్పే పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటి వరకూ ఫిల్టర్ వేసుకుని అందరివాడులా మాట్లాడుతున్న పవన్.. ఇప్పుడా ఫిల్టర్ తీసేశారు.
మంత్రి కన్నబాబు చెప్పినట్టే పవన్ కల్యాణ్ కి చంద్రబాబు మీద ప్రేమ పిసరంత కూడా తగ్గలేదు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ కాలయాపన చేసిందంటూనే.. తిరిగి టీడీపీ అధికారంలోకి రాకపోవడం వల్లే కాపులు 5 శాతం రిజర్వేషన్లు కోల్పోయారని, జగన్ వచ్చీ రాగానే రిజర్వేషన్లు తీసేశారంటూ అసత్యప్రచారం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
కాపు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఎన్నికల ముందే కుండబద్ధలు కొట్టిన జగన్ ని, కాపు వర్గం దూరం చేసుకోలేదు. అదే సమయంలో ఆయా వర్గాల అభివృద్ధికి జగన్ ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేశారు. గెలిచాక జగన్ చేస్తున్న అభివృద్ధిని కళ్లారా చూస్తున్నారు. నిజమైన కాపునేస్తం జగనేనని అంటున్నారు. మరిప్పుడు పవన్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి?
పవన్ సమస్య అంతా ఒకటే ఇప్పుడు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో కాపులు వైసీపీ వైపు వెళ్లకూడదు. ఇటు తన రహస్య మిత్రుడు బాబు కోసం, అటు తన బహిరంగ మిత్రుడు బీజేపీ కోసం ఆయన కాపు ఓటు బ్యాంక్ ను పరిరక్షించుకోవాలి. అందుకే ఈ వితండవాదం. అసత్యప్రచారం.
రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్ల అంశం తేలదని తెలిసి కూడా పవన్ కల్యాణ్ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ని టార్గెట్ చేస్తూ.. కాపు వర్గాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు కాపు నాయకుడు పవన్ కల్యాణ్. అయితే ఆయన తెలుసుకోవాల్సిన కఠోర వాస్తవం ఏంటంటే.. రాష్ట్రంలో ఇప్పుడు పవన్ ను కాపులు కూడా నమ్మడం లేదు.