గత ఎన్నికల ప్రచారంలో ఎల్లో మీడియా అరాచకాల్ని ఎండగట్టారు జగన్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ లాంటి పేర్లను బహిరంగంగా చెప్పి మరీ విమర్శలు చేశారు. మీడియాను అడ్డు పెట్టుకొని చంద్రబాబు సాగించిన అరాచకాల్ని ప్రజలకు విడమర్చి చెప్పారు. ఆ ఎన్నికల్లో జగన్ కు అది ప్రధాన అస్త్రంగా మారింది. మరి 2024 ఎన్నికల్లో జగన్ కు ఏది ప్రధాన అస్త్రంగా మారబోతోంది.
సరిగ్గా ఇక్కడే రాజకీయ విశ్లేషకులు కోర్టు తీర్పుల అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో జగన్ కు కోర్టు కేసులే అస్త్రాలుగా మారబోతున్నాయని అంటున్నారు. కోర్టు కేసులతో జగన్ పై ఇప్పుడు తాత్కాలిక విజయాల్ని సాధిస్తున్న ప్రతిపక్షం.. ఎన్నికల నాటికి అదే తాము చేసిన అతి పెద్ద తప్పుగా బాధపడాల్సిన సందర్భం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రజల బాగు కోసం, పేదల సంక్షేమం కోసం జగన్ ఏం చేసినా టీడీపీ జనాలు కోర్టులకు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, 3 రాజధానుల అంశం నుంచి వైఎస్ఆర్ చేయూత వరకు దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరికి అమ్మఒడిని కూడా కోర్టులో సవాల్ చేసి జగన్ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ అంశాలన్నింటినీ హైలెట్ చేసే అవకాశం ఉంది. కోర్టు కేసుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు సృష్టిస్తున్న అరాచకాల్ని ఎత్తిచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇది బాబుకు ఇబ్బంది కలిగించే అంశం. కోర్టు కేసులకు సంబంధించి తెరపైకి చంద్రబాబు పేరు రాకపోయినా, దాని వెనక బాబు ఉన్నారనే విషయం ఏపీ ప్రజానీకం మొత్తానికి తెలుసు.
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, తల్లిదండ్రుల్ని రెచ్చగొట్టి కోర్టులో కేసు వేయించారు. చివరకు పరీక్షలు లేకుండా చేశారు. ఏ పోటీ పరీక్షకైనా మార్కులు, పర్సంటేజీలు తప్పనిసరి కావడంతో ఇప్పుడు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.
జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన సొమ్ము తల్లిదండ్రుల చేతుల్లోకి వెళ్లాలని, వారి సమ్మతి ద్వారా కాలేజీ ఫీజులు కట్టాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు దీన్ని అడ్డుకున్నాయి. నేరుగా ఆ డబ్బు తమకే రావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షం సపోర్టుతో కోర్టుకెక్కి తమ పంతం నెగ్గించుకున్నాయి.
లేట్ క్యాలెండర్..
ఫలానా కార్యక్రమం ఫలానా టైమ్ లో మొదలు కావాల్సి ఉంది, కానీ ఫలానా కేసు వల్ల ఇన్ని రోజులు ఆలస్యమైంది… అనే కారణాలు వివరిస్తూ లేట్ క్యాలెండర్ ఒకటి తెరపైకి తీసుకురాబోతోంది వైసీపీ. జగనన్న కాలనీల విషయంలో జరిగిన జాప్యానికి కోర్టు కేసులే కారణం అని చెప్పబోతోంది.
ఇంటింటికీ రేషన్ సరకులిచ్చే వాహనాలను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకోవాలని ప్రతిపక్షం చేసిన ప్రయత్నాన్ని తెరపైకి తేబోతోంది. ఇలా ప్రతి పథకం లేట్ కావడానికి, కొన్ని అసలు పట్టాలెక్కకపోవడానికి కారణం ప్రతిపక్షమేననే విషయాన్ని లేట్ క్యాలెండర్ ద్వారా హైలెట్ చేయబోతున్నారు వైసీపీ నేతలు.
నష్టం ఎవరికి..?
కోర్టు కేసుల్ని పైకి టీడీపీ-వైసీపీ మధ్య పోటీగా అందరూ చూస్తున్నప్పటికీ.. అంతిమంగా నష్టపోయింది, నష్టపోతోంది ప్రజలే. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తోంది. ప్రతిపక్షం మాత్రం రాక్షసానందాన్ని పొందుతోంది.
ఈ అంశాన్ని వైసీపీ విజయవంతంగా ప్రజల ముందుకు తీసుకెళ్తే.. ఇప్పటికే బిక్కచచ్చిపోయిన ప్రతిపక్షాన్ని ప్రజలు పాతాళానికి తొక్కేయడం ఖాయం. కోర్టు కేసులతో ఓవర్ యాక్షన్ చేస్తున్న టీడీపీకి, టైమ్ చూసి జగన్ షాక్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ రోజు అతి దగ్గర్లోనే ఉంది.