ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో సాగుతోంది. ఈ యాత్రకు చెప్పుకో తగిన ఆదరణ లభిస్తోందని వార్తలొస్తున్నాయి. జాతీయ స్థాయిలో 8 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ వుంటోంది. దీంతో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జునఖర్గే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ భారత్ జోడో యాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాదయాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజల్ని రాహుల్ కలుసుకుంటున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ్టి పాదయాత్రలో రాహుల్ వెంట వివాదాస్పద నటి పూనమ్‌కౌర్ నడిచారు. రాహుల్ వెంట పూనమ్ నడవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నటిగా కంటే వివాదాస్పద వ్యక్తిగా పూనమ్ గుర్తింపు పొందారు.
సోషల్ మీడియాలో పూనమ్ యాక్టీవ్‌గా వుంటారు. తరచూ ఏదో ఒక పోస్టు పెట్టడం, ఆ తర్వాత తొలగించడం పూనమ్‌కు వెన్నతో పెట్టిన విద్య. పూనమ్‌తో మన టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆమె పేరు టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా పరిచయం. కొన్ని సందర్భాల్లో రాజకీయ వివాదాలకు కూడా పూనమ్ కారణమైంది.
ఇదిలా మహబూబ్‌నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్‌లోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి శనివారం రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో మద్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేశ్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నప్పటికీ, అందరి దృష్టిని పూనమ్ కౌర్ ఆకర్షించారు. రాహుల్ వెంట పూనమ్ ఎందుకు నడిచారనే చర్చకు తెరలేచింది.