రామోజీరావుకి ఆరోగ్యం బాగోలేదు, చివరి రోజుల్లో ఆయన భారత్ వదిలి వెళ్లనంటున్నారు, నా తుదిశ్వాస భారతదేశంలోనే విడుస్తానని తెగేసి చెప్పారు. అందుకే ఆయనకు ఫిలింసిటీలోనే రహస్యంగా వైద్యం అందిస్తున్నారంటూ ఓ పుకారొచ్చింది. ఫేస్ బుక్ పేజీలతో పాటు, వాట్సప్ గ్రూపుల్లో కూడా విపరీతంగా ఈ వార్త సర్క్యులేట్ అయింది. చివరకు ఈనాడు ఉద్యోగులు కూడా ఒకరినొకరు ఎంక్వయిరీ చేసుకున్నారు.
ఫైనల్ గా తేలిందేంటంటే.. రామోజీరావు ఆరోగ్యం బాగానే ఉంది. ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు, అసలు ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఆయనకు లేదు అని రామోజీ సంస్థల ఉద్యోగులు క్లారిటీ ఇచ్చారు. కానీ అందరిలో ఏదో అనుమానం, ఆ క్లారిటీ ఏదో రామోజీ గ్రూపే ఇస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. అయితే దీనికి రామోజీరావే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
హడావిడిగా ఈరోజు రామోజీ ఫిలింసిటీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎడారిలో ఒయాసిస్సు – ఇజ్రాయెల్ వ్యవసాయం అనే పేరుతో ఈనాడు ఉద్యోగి, అన్నదాత ఎడిటర్ రాసిన ఓ పుస్తకాన్ని రామోజీరావు తన స్వహస్తాలతో విడుదల చేశారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసింది కూడా రామోజీరావే కావడం విశేషం.
వాస్తవానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం కాస్త పెద్దఎత్తున చేయాలని అనుకున్నారట. బయట వేదికపై ఆవిష్కరణ జరపాలని, ఆ తర్వాత రామోజీరావు చేతుల మీదుగా ఓ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నారట. ఇంతలోనే పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టేసరికి రామోజీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు రామోజీరావు. అంటే ఆయన ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సో.. ఇటు పుస్తకావిష్కరణ పూర్తిచేసి, అటు తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు రామోజీరావు.