గట్టిగా మూడురోజుల కిందట వరకు సాహోకు సరైన పబ్లిసిటీ లేదు అన్నదే టాక్. సాహో యూనిట్ తెలుగు వెర్షన్ ను అంతగా పట్టించుకోవడం లేదన్నదే అభిమానుల కంప్లయింట్. కానీ మూడురోజులు గడిచింది. సినిమా విడుదల మూడు రోజుల్లోకి వచ్చింది. ఆంధ్రలో సినిమా అభిమానులు సాహో… సాహో అంటూ ఊగిపోతున్నారు. సరైన సినిమా లేక వెల వెలబోతున్న థియేటర్లన్నీ సాహో సినిమా కోసం ముస్తాబయిపోయాయి. పది థియేటర్లు వుంటే ఎనిమిది థియేటర్లలో సాహో తొలిరోజు ప్రదర్శించే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తోంది.
ఆంధ్రలో అనేకచోట్ల స్పెషల్ షోలను భయంకరమైన రేట్లకు అమ్మేస్తున్నారు. ఫ్యాన్స్, యూత్ గ్రూప్ లు, స్టూడెంట్ గ్రూప్ లు, షోలు కొనుక్కుని వెయ్యి, పదిహేను వందలు టికెట్ వంతున అమ్ముతున్నారు. ఎర్లీ మార్నింగ్ షోలు విపరీతంగా షురూ అయ్యాయి. ఉత్తరాంధ్రలో దాదాపు 130 థియేటర్ల వరకు కేవలం సాహో సినిమా కోసం బుక్ చేసారు. తొలిరోజు అయిదు కోట్ల వరకు వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఉత్తరాంధ్రకు 15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. తొలిరోజు అయిదు కోట్ల వసూలు అంటే, సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ పదికోట్లు వచ్చే అవకాశం వుంది.
ఈస్ట్ గోదావరిలో సాహో ఫీవర్ ఫుల్ గా అందుకుంది. ప్రతిచోటా ఎర్లీ హవర్స్ షోలు కనిపిస్తున్నాయి. కాకినాడలో ఇప్పటికి పెట్టిన నాలుగు థియేటర్లు తొలిరోజు ఫుల్ అయిపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇంకా మల్టీఫ్లెక్స్ లో ఓపెన్ కాలేదు. రాజమండ్రిలో దాదాపు మూడువంతుల థియేటర్లు సాహో.. సాహో.. అంటున్నాయి. వెస్ట్ గోదావరి సంగతి చెప్పనక్కరలేదు. భీమవరంలో ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ రేటు ఒక్కోచోట మూడువేలు పలుకుతోంది. ఈస్ట్ వెస్ట్ కలిపి 19 కోట్లకు విక్రయించారు. రెండుజిల్లాల్లో తొలిరోజు షేర్ ఏ మేరకు వుంటుందన్నది చూడాలి.
అన్ని జిల్లాల్లో, ఏరియాల్లో కూడా అడ్వాన్స్ లు గట్టిగానే వచ్చాయి. అలాగే ఫిక్స్ డ్ హయ్యర్లు, మినిమమ్ గ్యారంటీలు కూడా బాగానే వున్నాయి. అందువల్ల మంచి అంకెలు కనిపించే అవకాశం వుంది. కృష్ణ, నెల్లూరు జిల్లాలు యువి క్రియేషన్స్ స్వంతంగా విడుదల చేసుకుంటోంది. ఈ మూడు ఏరియాలు కలిపి పాతికకోట్ల వరకు వసూళ్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. అంటే మొత్తం ఆంధ్ర అంతా కలిపి, 60 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకున్నారు. సీడెడ్ మాత్రం ముక్కలు ముక్కలు కింద చాలావరకు విక్రయించేసారు.
ఓ పాతిక కోట్ల టార్గెట్ వుంది అక్కడ. ఇక నైజాం దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. అడ్వాన్స్ కు ఏముంది. ఎంత కావాలంటే అంతా ఇస్తారు. ఎంత టార్గెట్ అన్నది చూడాలి. 40 కోట్లు వస్తే బ్లాక్ బస్టర్ అనుకోవాల్సిందే. మహర్షి సినిమా జిఎస్టీతో కలిసి 30 కోట్ల వరకు వచ్చింది అని టాక్ వుంది. అందువల్ల ఇంత భారీ సినిమా కాబట్టి 40 వరకు ఆశించడం కామన్.
నైజాంలో అదనపు షోలు, బెనిఫిట్ షోల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రేపటికి ఏ విషయం తేలుతుందని, ఎర్లీ మార్నింగ్ షో అయితే పక్కా వుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏఎమ్బీ మల్టీఫ్లెక్స్ లో ఓపెన్ చేసిన ప్రతి స్క్రీన్, ప్రతి షో సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇదే పరిస్థితి సింగిల్ స్క్రీన్ లలో కూడా వుంది.
బెంగుళూరులో సాహో ఫీవర్ మామూలుగా లేదు. ఇలా ఓపెన్ చేస్తుంటే టికెట్ లు అలా గాయబ్ అయిపోతున్నాయి. కర్ణాటక హక్కులు 28 కోట్లకు విక్రయించారు. మరి తొలిరోజు ఏ మేరకు వస్తుందో చూడాలి. మొత్తంమీద బాహుబలి తరువాత సినిమా ప్రేక్షకులు అంతలా ఊగిపోయే సినిమాగా సాహో పేరు తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా తెచ్చుకుంటే ప్రభాస్ తెలుగులో నెంబర్ వన్ హీరో అవుతాడు.