ఎంతైన భజన చేయాలంటే తమ్ముళ్ళ తరువాతే. లేకపోతే నిమ్మాడ వచ్చి నిమ్మళంగా అచ్చెన్నాయుడు ఫ్యామిలీని పరామర్శించి వెళ్ళిపోకుండా తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ తన గురించి కెలుక్కున్నాడు. ఎవరూ అడగకుండానే ఫైబర్ గ్రిడ్ స్కాం లో నా తప్పు లేదంటూ భుజాలు తడుముకున్నాడు.
ఆ తరువాత పెళ్ళానికి మెసేజ్ పెట్టాలన్నా జగన్ పర్మిషన్ తీసుకోవాలంటూ మరో రకమైన కామెడీ లోకేష్ పండించాడు. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ పడికట్టు పదాన్ని పదే పదే వల్లె వేస్తూ అక్కడికేదో వైసీపీ సర్కార్ ని చెడుగుడు ఆడేసినట్లుగా మీడియా ముందు ఫోజులిచ్చాడు.
ఇక మంత్రులంటే ఇంతే.. సింపుల్ గా రోజుకు వంద సంతకాలు పెడతారూ, చూసీ చూడకుండా చేస్తారు అంటూ చెప్పడమే కాదు, ఒప్పు అయితే మాది తప్పు అయితే అధికారులది అన్నట్లుగా లోకేష్ బాబు కలరింగు ఇస్తూ అచ్చెన్న పాపమేమీ లేదన్నట్లుగా లాజిక్ లేని వాదన వినిపించాడు.
ఇక తప్పులూ తడబాట్లు లేకుండా లోకేష్ మాటలు ఉండవనడాన్ని రుజువు చేస్తూ విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ని కాస్తా మానసా ట్రస్ట్ అని పలుకుతూ మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు గారికే అయోమయం కలిగేలా చేశారు.
ఇన్ని చేసిన లోకేష్ బాబుని మజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వెనకేసుకువస్తున్నారు. మా లోకేశం బంగారం అంటున్నారు. లైవ్ ప్రెస్ మీట్లో రెచ్చిపోయారని కితాబు ఇస్తున్నారు. లోకేష్ సంతకం పెడితే కేంద్రం అవార్డులు దొర్లుకుంటూ వచ్చాయని కూడా తెగ పొగుడుతున్నారు.
సరే అవన్నీ గతం, ఇపుడు లోకేష్ సంతకాల విలువ ఏంటో గుట్టు బయటపెడతామని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఆ సినిమా కూడా పూర్తిగా చూసి అపుడు చినబాబుని మరింత పొగిడితే బాగుంటుందేమో అయ్యన్న అంటున్నారు.